నాలుగేళ్లు దాటినా ఎక్స్‌గ్రేషియా అందలేదు

12 Mar, 2019 11:11 IST|Sakshi
తమ్మారెడ్డి భార్యా పిల్లలు

కర్నూలు జిల్లా : సేద్యం కోసం చేసిన అప్పులు రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా బాధిత రైతు కుటుంబం ఎక్స్‌గ్రేషియాకు నోచుకోక నాలుగేళ్లుగా తీరని శోకంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. కర్నూలుజిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోస్గి మండలం సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన మేకల తమ్మారెడ్డి(40) అప్పుల బాధతో 2014 సెప్టెంబర్‌ 8న పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్మారెడ్డికి 3 ఎకరాల సొంత భూమి ఉంది.  పొలంలో ఉల్లి, పత్తి పంటలను సాగు చేశాడు. మూడేళ్ల పాటు పంటలు చేతికి రాక, గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బ్యాంక్‌లో రూ. 60 వేలు, బయట రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు.

2014లో వానలు లేక ఉల్లి పంట అరకొరగా పండింది. పండిన పంటకు సైతం ధర లేదు. దీంతో కుమిలిపోయాడు. పొలంలోనే పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య రాధమ్మ, కుమారులు జగన్నాథం, మర్రిస్వామి, కుమార్తె ధరణి ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో వారి కుటుంబ జీవనం దుర్భరంగా మారింది. సేద్యం చేసుకునే స్థోమత లేక పొలాన్ని కౌలుకు ఇచ్చిన రాధమ్మ తన పెద్ద కొడుకు జగన్నాథాన్ని బడి మాన్పించి కూలీ పనులకు తీసుకెళ్తున్నది. ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం అందలేదు. వితంతు పింఛన్‌ మాత్రం అందుతున్నది. పూరి గుడిసెలో నివాసం ఉంటూ పుట్టెడుదుఃఖంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కనికరించకపోతుందా, ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతుందా అన్న ఆశ తో రోజులు వెళ్లదీస్తోంది.– కె. పరశురాంసాక్షి, మంత్రాలయం, కర్నూలు జిల్లా

మరిన్ని వార్తలు