వీరిక మాజీలు

22 Feb, 2014 03:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : రఘువీరారెడ్డి.. శైలజానాథ్.. ఇద్దరూ మాజీ మంత్రులయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఆమోదించడంతో మంత్రి మండలి మొత్తం రద్దయింది. దీంతో జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు కూడా మాజీ మంత్రులయ్యారు. ఈ క్రమంలో మంత్రి హోదాలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన కళ్యాణదుర్గం-మడకశిర రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులకు శనివారం భూమి పూజ చేయాలన్న రఘువీరా కల కలగానే మిగిలిపోయింది.  
 
 రఘువీరాపై విమర్శల వెల్లువ
 మడకశిర నియోజకవర్గం నుంచి 1989లో రాజకీయ అరంగేట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన రఘువీరా..కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేశారు. 1994లో ఓడిపోగా.. 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో వైఎస్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. మడకశిర నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో 2009లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి వైఎస్ ప్రభంజనంలో విజయం సాధించారు.
 
 రెండోసారి మంత్రిగా వ్యవసాయ శా ఖను దక్కించుకున్నారు. అయితే వైఎస్ హఠాన్మరణం తర్వాత రఘువీరా దారితప్పారనే విమర్శలు ఉన్నాయి. సొంత లాభం కోసం అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. రోశయ్య మంత్రివర్గంలోనూ వ్యవసా య మంత్రిగా ఉన్న రఘువీరా.. కిరణ్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. ఈ సమయంలో పవన విద్యుదుత్పత్తి సంస్థలకు భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించారనే విమర్శలు ఉన్నా యి. ఆయన రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నప్పుడు జిల్లాకు ఒనగూరింది ఏమైనా ఉందా అంటే.. అది కళ్యాణదుర్గం, కదిరి కేంద్రాలుగా రెండు రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు మాత్రమే.
 
 శైలజానాథ్‌పై ఆరోపణల వెల్లువ .. శింగనమల నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజానాథ్ అరంగేట్రంలోనే విజయం సాధించారు. 2009లోనూ వైఎస్ హవాలో గెలుపొందారు. అనంతరం శైలజానాథ్‌కు విప్ పదవిని వైఎస్ కట్టబెట్టారు. వైఎస్ మరణానంతరం కిరణ్ మంత్రివర్గంలో జేసీ దివాకరరెడ్డికి పదవి ఇవ్వకూడదని జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన అధిష్టానం జేసీకి స్థానం దక్కకుండా మోకాలొడ్డింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో శైలజానాథ్ అనూహ్యంగా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అయ్యారు. మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి శైలజానాథ్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి.
 
 పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు యూనీఫాం సరఫరాలో, సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాల భవనాల నిర్మాణంలోనూ భారీ ఎత్తున పర్సంటేజీలు దండుకున్నారనే విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచే విన్పించాయి. మంత్రి శైలజానాథ్ వ్యవహారశైలి ‘కోబ్రా పోస్ట్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రట్టవడం సంచలనం రేపింది. బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంటపల్లిలోని తన పొలానికి, ఇంటికి ప్రభుత్వ నిధులతో తారు రోడ్డును నిర్మించుకున్న ఆయన.. తన పొలానికి హెచ్చెల్సీ నీటిని కూడా చౌర్యం చేయడం విమర్శలకు దారితీసింది. 

మరిన్ని వార్తలు