మూడు నెలలుగా పింఛన్‌ రాలేదు

8 Jun, 2018 21:03 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌

పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ ఆవేదన

 పలమనేరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మాజీ ఎమ్మెల్యేలకు అందించే పింఛన్‌ మూడు నెలలుగా తనకు అందలేదని, దాన్నే నమ్ముకుని బతికే తనకు జీవనం కష్టంగా ఉందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వగృహంలో గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ప్రతినెలా రూ.30 వేలు పింఛన్‌గా ఇచ్చేదన్నారు. తాను అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి ఏమీ సంపాదించుకోలేదని, ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిపారు.

కనీసం ఆస్పత్రి ఖర్చులు, దైనందిన జీవనానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని బాధపడ్డారు. ఆర్థికంగా బాగున్న మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్‌ పెద్ద విషయం కాదని, తనలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పింఛన్‌ విషయంగా ఏదేని సమాచారం కావాలంటే అమరావతిలోని ఎమ్మెల్యేల పింఛన్‌ కార్యాలయం నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తన హయాంలో ఇలాంటి చెత్త పాలనను ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. కనీసం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా తనకు మూడు నెలల పింఛన్‌ అందేలా చూడాలని కోరారు.

మరిన్ని వార్తలు