మాజీ ఎమ్మెల్యే తనయుడి వీరంగం

10 Oct, 2019 09:59 IST|Sakshi

సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మండలంలోని మాతల గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్‌ తన అనుచురులతో కలిసి వీరంగం సృష్టించాడు. వైఎస్సార్‌సీపీ వర్గీయులతోపాటు ఇద్దరు గ్రామ వలంటీర్లపై మూకుమ్మడిగా మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ వర్గీయులు కలమట శ్రీరాములు, పప్పలు తిరుపతిరావులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సామాజిక భవనంలో గ్రామ సచివాయం ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు భవనానికి రంగులు వేసేందుకు వెళ్లిన కార్మికులతోపాటు కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో కలిసి అడ్డుకున్నాడు.

భవన నిర్మాణానికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం చెల్లించనందున రంగులు వేయవద్దంటూ అడ్డుకున్నాడు. కులం పేరుతో ధూషించి దర్భాషలాడాడు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇది కొట్లాటకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ వర్గీయులు కలమట శ్రీరాములు, పప్పల తిరుపతిరావు, గ్రామ వలంటీర్లు గుంట రూపశంకర్, బూరాడ నాగరాజు, మజ్జి రాజశేఖర్‌లపై దాడి చేశారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గ్రామంలో శాంతిభద్రత దృష్ట్యా ప్రత్యేక బలగాలు పహారా కాస్తున్నాయి.

టీడీపీ శ్రేణులు కలమట సాగర్, రేగేటి సూర్యారావు, రమేష్, యుగంధర్, వినోద్, రామారావు, జగదీష్, భాస్కరరావు గంగివలస తేజేశ్వరరావు కలమట చంద్రరావుతోపాటు 14 మందిపై గుంట రూపశంకర్‌ ఫిర్యాదు చేశాడు. ప్రతిగా టీడీపీకి చెందిన కాని తవిటయ్య వైఎస్సార్‌సీపీకి చెందిన కలమట శ్రీరాములు, కాగితపల్లి వెంకటేష్, రమేష్‌లతోపాటు 18 మందిపై ఫిర్యాదు చేశాడు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఎస్‌ఐ బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

స్పందించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి
సంఘటనపై ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తూరు చేరుకున్న ఎస్పీ మాతల సంఘటనపై ఆరా తీశారు. 
గ్రామంలో సచివాలయం ఏర్పాటుకు సహకరించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ
మాతల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కొత్తూరు సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇరువర్గాలు అట్రాసిటీ కేసులు పెట్టుకున్నందున దర్యాప్తు చేయాలని పాలకొండ డీఎస్పీకి ఆదేశించామన్నారు. మాతలలో పికెటింగ్‌ ఏర్పాటు చేయాలని సీఐకు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లో తగాదాలు రాకుండా ముందస్తుగా ఎస్‌ఐలు రాత్రిబస చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అంతకుముందు కొత్తూరు, పాతపట్నం సర్కిల్‌ పరిధిలో నేరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో సీఐలు ఎల్‌ఎస్‌ నాయుడు, రవికుమార్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు