‘టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి’

15 Sep, 2018 18:32 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి మండిపడ్డారు. గుత్తి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మిథున్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. కోర్టు నుంచి కేవలం నోటీసులు రాగానే కుట్ర అంటూ సానుభూతి పొందే  ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని ధ్వజమెత్తారు.

తాడిపత్రి నియోజవర్గంలో జేసీ సోదరులు, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేత పెద్దారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారని మిథున్‌ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలపై పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారని తెలిపారు. కొంతమంది అధికారుల వల్ల పోలీసు డిపార్ట్ మెంట్‌కు చెడ్డ పేరు వస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదారు నెలలు మాత్రమే ఉండబోతుందని, వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం అని అన్ని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని మిథున్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు