కడప రెడ్డి ఐనా..మెత్తటి మనసు ఆయనది

14 May, 2019 21:23 IST|Sakshi

హైదరాబాద్‌: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రచించిన‘  వైఎస్సార్‌తో.. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌’  పుస్తకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌తో పాటు పలువురు మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని హోటల్‌ దస్‌పల్లాలో జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌తో తమ అనుభవాలను మాజీ ప్రభుత్వ అధికారులు పంచుకున్నారు.

ఎన్టీఆర్‌, వైఎస్సార్‌కే ప్రజాదరణ ఉంది: జాస్తి
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో తనకు చాలా తక్కువ పరిచయముందని ఈ సందర్భంగా జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తెలియజేశారు. 1984లో వైఎస్‌ఆర్‌ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేశారని, అవి లోకాయుక్తకు వస్తే తనను పంపించారు.. ఆ కేసులో సాక్ష్యం చెప్పడం కోసం వైఎస్‌ఆర్‌ వస్తే సర్కార్‌ ప్లీడర్‌గా కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. 2004 సమయంలో పుచ్చలపల్లి మీద పుస్తకం ఆవిష్కరణ సభలో ఒకసారి వైఎస్‌ను కలిసినట్లు వెల్లడించారు.

సీఎం అయ్యాక ఒకటి రెండు సార్లు మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న నాయకులంటే తనకు ఇష్టమన్నారు. ప్రకాశం పంతులు గారి గురించి కూడా చాలా మంది చెబుతారు..ఆయన్ను కూడా తాను చూడలేదన్నారు. ఎన్టీఆర్‌, వైఎస్‌లు మాత్రమే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులని కొనియాడారు. కొందరిలో మాత్రమే ప్రజాదరణ పొందగల సామర్ధ్యం ఉంటుందన్నారు.

కడప రెడ్డి అయినా.. మెత్తటి మనసు ఆయనది: రమాకాంత్‌ రెడ్డి
ఫ్యాక్షన్‌ ప్రభావం ఉన్న కడప జిల్లాకు చెందిన రెడ్డి అయినా.. మెత్తటి మనసు ఆయనదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ రమాకాంత్‌ రెడ్డి కొనియాడారు.  కడప కోసం రూ.40 కోట్లు ఇస్తావా అని ఒక సీఎంగా వైఎస్‌ఆర్‌ అమాయకంగా అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇంత పెద్ద నాయకుడు ఇంత అమాయకుడా అనిపించిందని చెప్పారు. నా సలహాలు.. సూచనలు కూడా వినేవారని అన్నారు. 8 నెలల కసరత్తు తర్వాత రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం బయటికి వచ్చిందని వెల్లడించారు.

రాజుకు ఉండే లక్షణాలు వైఎస్‌లో ఉండేవి: అర్వింద్‌ రావు
తాను వైఎస్‌ఆర్‌ను 1987లో కడప ఎస్పీగా ఉన్నపుడు తొలిసారి చూశానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ అర్వింద్‌ తెలిపారు. ఆ తర్వాత పెద్దగా ఆయన్ను కలిసే అవకాశం రాలేదని చెప్పారు. కానీ 2004లో సీఎం అయ్యాక ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా ప్రమోషన్‌గా ఇచ్చారని గుర్తు చేశారు. నక్సలైట్లతో చర్చలు కూడా మా హయాంలోనే జరిగాయని తెలిపారు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు వైఎస్‌లో ఉండేవని కొనియాడారు. విధి లీలగా ఆయన మరణం జరిగిందేమోనని వ్యాఖ్యానించారు.

హ్యూమన్‌ టచ్‌ ఆయనలో చాలా ఉండేది: ప్రభాకర్‌ రెడ్డి
ఎక్కడికి వెళ్లినా ప్రజలు అడిగింది వైఎస్సార్‌ ఇచ్చేవారని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి ప్రభాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం వచ్చే ప్రజల్ని చూసే ఆరోగ్య శ్రీ వచ్చిందని తెలిపారు. ఎంత అలిసిపోయినా సాయంత్రం లోపే వినతిపత్రాల మీద నిర్ణయం తీసుకునే వారని చెప్పారు. మోనోశాంటో కంపెనీ మీద కేసు నడుస్తుంటే మూడు సార్లు పీఎం ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చినా కూడా వైఎస్సార్‌ వెనకడుగు వెయ్యలేదని గుర్తు చేశారు. రూ.1800 ఉన్న బీటీ విత్తనాలను రూ.600 కే రైతులకు దొరికేలా చేశారని చెప్పారు. ఆరోగ్యం మీద మంచి శ్రద్ధగా ఉండేవారని, ఫిట్‌గా ఉండాలని ఎప్పుడూ అనేవారని గుర్తు చేశారు. హ్యూమన్‌ టచ్‌ ఆయనలో చాలా ఉండేదని పొగిడారు.

ఆయన్ను తలచుకోని రోజు ఉండదు: ఉండవల్లి జ్యోతి
వైఎస్సార్‌ను తలచుకోని రోజు ఉండదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సతీమణి ఉండవల్లి జ్యోతి అన్నారు. మామూలు కార్యకర్తగా ఉన్న అరుణ్‌కుమార్‌ను ఇంత స్థాయికి తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దేనన్నారు. మాకు వైఎస్‌ఆర్‌ ఇంటి పెద్ద అని చెప్పారు. వైఎస్‌, కేవీపీ పేర్లు వింటేనే మాకు ఒక భరోసా...పిల్లర్‌ లాగా ఉంటుందని చెప్పారు.

టైం మేనేజ్‌మెంట్‌ ఆయన దగ్గర నేర్చుకోవాలి: ఐవైఆర్‌
టైం మేనేజ్‌మెంట్‌ గురించి వైఎస్‌ దగ్గర నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు అన్నారు. అనవసరపు సమీక్షలు, చర్చ ఉండేది కాదన్నారు. మానవత్వం ఉన్న మనిషి వైఎస్‌ఆర్‌ అని కొనియాడారు. పర్సనల్‌ స్టాఫ్‌ను ఎంచుకోవడంలో వైఎస్‌ను మించినవారులేరని అభిప్రాయపడ్డారు.

జీవితాన్ని మలుపు తిప్పింది ఆ ఘటనే: కేవీపీ
వైఎస్‌తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకోవడం కోసమే మీరంతా ఇక్కడ ఉన్నారు..ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ నా శ్రీమతి అనడం నాకు గర్వకారణమని రాజ్యసభ ఎంపీ, వైఎస్‌ ఆప్త మిత్రులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఉదయం 9 గంటలకు రెడీ అవ్వలేక సీడబ్యుసీ పదవి వదులుకున్న వ్యక్తి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అని చెప్పారు. 1966లో వైఎస్‌ఆర్‌ పరిచయమయ్యారని తెలిపారు. 1966 నుంచి 2009 సెప్టెంబర్‌ 2 వరకు అవిభక్త కవలల లాగా జీవించామని చెప్పారు.

ఈ పుస్తకం ద్వారా మళ్లీ వైఎస్‌ను గుర్తు చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన పాదయాత్ర అని చెప్పారు. పాదయాత్రలో పుట్టిందే.. ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటివి అన్నీ అని వెల్లడించారు. పాదయాత్ర తర్వాత ఏపీ మారిపోయిందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ మీద రోశయ్య సొంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ పుత్ర వాత్సల్యం చూపించారని పేర్కొన్నారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
వైఎస్సార్‌తో.. ఉండవల్లి పుస్తక ఆవిష్కరణ

>
మరిన్ని వార్తలు