అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి - ఎంపీ మేకపాటి

20 Oct, 2014 02:48 IST|Sakshi
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి - ఎంపీ మేకపాటి

నెల్లూరు(బృందావనం): భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా క్రీడల్లో రాణించలేకపోతున్నామన్నారు.

కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. ఇటీవల ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారుల ప్రతిభ అభినందనీయమన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాపోటీలకు నెల్లూరు వేదికకావడం గర్వకారణమన్నారు. క్రీడలకు తమ వంతు ప్రోత్సాహం అందజేస్తామన్నారు.

ఆకస్మిక వర్షం కారణంగా ఫైనల్ పోటీలు జరగకపోవడం కొంత వెలితిగా ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రీడాస్ఫూర్తిప్రధానమన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారత్ క్రీడలకు చిరునామా కావాలన్నారు. ఇందు కోసం అన్నివర్గాల సహకారం అందాలన్నారు. కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వై.రాజారావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రావ్, డీఎస్‌డీఓ ఎతిరాజ్, జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి, టోర్నమెంట్ కమిటీ చైర్మన్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు