చెన్నై ఆర్బీఐలో పాత నోట్ల మార్పు

29 Mar, 2017 03:24 IST|Sakshi
చెన్నై ఆర్బీఐలో పాత నోట్ల మార్పు

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి నుంచి రద్దయిన పెద్ద నోట్లను స్వీకరించడానికి అధికారం అప్పగించిన 5 కార్యాలయాలలో చెన్నైలోని రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాలయం ఒకటని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి మేఘవాల్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా మంత్రి జవాబిచ్చారు. గత ఏడాది నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 30 వ తేదీ వరకూ దేశంలో లేని భారతీయ పౌరులకు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా జమ చేయడానికి  వ్యవధి ఇచ్చారన్నారు. దేశంలో నివశిస్తున్న  పౌరులకు వ్యవధి కాలం మార్చ్‌ 31వరకూ ఉందని, బయట దేశాలలో నివశిస్తున్న పౌరుల కోసం జూన్‌ 30 వరకూ వ్యవధి ఉందని మంత్రి చెప్పారు.

భారతదేశంలో నివశిస్తున్న అర్హులైన భారతీయ పౌరులకు నోట్ల మార్పిడి కి ద్రవ్య పరిమితి లేదని,ఎన్నారై లకు మాత్రం ఫెమా నిబంధనలకు లోబడి పరిమితి ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. గత నెలాఖరు నాటికి ఏపీ నుంచి 509 మంది, తెలంగాణ నుంచి 301 మంది పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్న వారు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా జమ చేయడం చేశారని కేంద్ర మంత్రి చెప్పారు.

రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు చెన్నై లోని రిజర్వ్‌ బ్యాంక్‌ సందర్శిచడంతో త్వరిత గతిన సేవలు అందించడానికి అనువుగా డాక్యుమెంట్లను ధృవీకరించడానికి 7 గురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారని, సరైన డాక్యుమెంట్లు ఉన్నవారి వద్దనుంచి రద్దయిన నోట్లను స్వీకరించడానికి ప్రత్యేకంగా 3 కౌంటర్లను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ వివరించారు. నిబంధనల ప్రకారం రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని, దివ్యాంగులు,సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు