దశలవారీగా మద్యపాన నిషేధం

1 Oct, 2019 19:54 IST|Sakshi

ఎక్సైజ్‌ శాఖ  కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌

సాక్షి, విజయవాడ: నవరత్నాలలో భాగంగా దశలవారీ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో విధి విధానాలు నిర్ణయించాల్సి ఉందని.. ఇంకా 56 షాపులను గుర్తించాల్సి ఉందని చెప్పారు. మూడు మాత్రమే ఐఎంఎల్, బీరు బాటిళ్లు ఇచ్చేలా నిర్ణయించామన్నారు. కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిదని.. 3,500 షాపులని ఏపీఎస్‌బీసీఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం 3,317 షాపులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో షాపులు తీసేస్తామని తెలిపారు.

ఆలయాలు, ఆసుపత్రులు, పాఠశాలల దగ్గరలో మద్యం షాపులు ఉండవని స్పష్టం చేశారు. ఎమ్మార్పీ ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సుండి, ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారిని మాత్రమే సేల్స్‌మేన్‌లుగా నియమించామన్నారు. 12 వేల మందిని ఔట్‌సోర్స్‌ పద్దతిలో తీసుకున్నామని వెల్లడించారు. సూపర్‌వైజర్‌ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు వెంటనే ఇండెమ్నిటీ బాండు ఇవ్వాలని కోరారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం మద్యం అమ్మకాలు సాగుతాయన్నారు. ఎమ్మార్పీ అవకతవకలపై బెవరేజ్‌ కార్పొరేషన్‌ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 25 వాహనాలు లిచ్చామని.. మిగిలిన వాహనాలు త్వరలో ఇస్తామని నాయక్‌ తెలిపారు.

18 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి:
గత ఏడాదితో పోలిస్తే 18 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవ రెడ్డి అన్నారు. మద్యం మహమ్మారిని సమాజం నుంచి పారద్రోలేందుకు ఈ కొత్త మద్యం పాలసీ వచ్చిందని చెప్పారు.14,944 మంది మహిళా కానిస్టేబుళ్లు గ్రామ సచివాలయాల ద్వారా పని చేస్తారని వెల్లడించారు. 31 చెక్ పోస్టులు, 18 బోర్డర్ మొబైల్ బృందాలు ఉంటాయని తెలిపారు.

మూడు కేసులు నమోదయితే పీడీ యాక్ట్‌
93 ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఐడీ లిక్కర్‌, ఎన్‌డీపీఎల్‌ మీద దృష్టి పెడతాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పి.హరికుమార్‌ తెలిపారు. ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు టీంలు పనిచేస్తాయని చెప్పారు. 93 మండలాల్లో 204 గ్రామాలను నాటుసారా తయారీ గ్రామాలుగా గుర్తించామని పేర్కొన్నారు. 2019 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 4,875 సారా కేసులు నమోదు చేసామని..52,018 లీటర్ల సారాను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాలకు పక్క రాష్ట్ర్రాల సరిహద్దులు ఉన్నాయని.. ప్రతి యాభై ఇళ్లకి ఉన్న గ్రామ వలంటీర్లతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ కలసి పనిచేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. మద్యపాన నియంత్రణలో గ్రామ, వార్డు వలంటీర్ల సహాయం తీసుకుంటామని తెలిపారు. నెలలో మూడు కేసులు ఒకే వ్యక్తిపై నమోదయితే పీడీ యాక్టు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు