పెచ్చుమీరుతున్న సారా తయారీ

8 Dec, 2019 09:32 IST|Sakshi
పుంగనూరులో నాటుసారా బట్టీ వద్ద ఎక్సైజ్‌ పోలీసులు

జిల్లాలో 84 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. విక్రయ వేళలు తగ్గాయి. బార్లను కూడా 40 శాతం మూసేయడానికి కసరత్తు ప్రారంభమైంది. దీన్ని అదనుగా తీసుకున్న కొందరు సారా తయారీపై దృష్టిపెట్టారు. విచ్చలవిడిగా తయారుచేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అబ్కారీ శాఖ ఇప్పటికే దాడులు ముమ్మరం చేసినా..  సిబ్బంది కొరత వేధిస్తుండడంతో అన్ని వైపులా దృష్టి పెట్టలేకపోతోంది.

సాక్షి, చిత్తూరు: ‘జిల్లా వ్యాప్తంగా సారా తయారీ కేంద్రాలపై శనివారం నిర్వహించిన దాడుల్లో ఎక్సైజ్‌ శాఖ అధికారులు 2,900 లీటర్ల ఊట ధ్వంసం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టుచేశారు. 14 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. 64 లీటర్ల సారాను సీజ్‌ చేశారు. అధికారులు దాడులు చేస్తున్న ప్రతిసారీ వేల లీటర్ల సారా ఊట లభ్యమవుతోంది’ 

మద్యానికి ముకుతాడు 
మద్యం విక్రయాలు, పాలసీపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాలపై మహిళలతో పాటు అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో అప్పటివరకు ఉన్న 430 మద్యం దుకాణాల్లో.. ప్రస్తుతం 344 మిగిలాయి. ఏటా మరో 20 శాతం దుకాణాలను తగ్గించుకుంటూ వెళుతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 40కు పైగా ఉన్న బార్లలో తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్‌లో 20 మాత్రమే మిగిలాయి.  

అలవాటు మానుకోలేక..
గతంలో వేళాపాళా లేని మద్యం విక్రయాలు, 24 గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉన్న బెల్టు దుకాణాల ద్వారా మందుబాబులకు ఎనీటైమ్‌ మద్యం లభించే పరిస్థితి ఉండేది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాత్రి 8 గంటలు దాటితే మద్యం దుకాణాలు మూసేస్తున్నారు. బార్లలో రేట్లు అధికంగా ఉండడంతో మద్యాన్ని క్రమంగా మానేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటే.. గత ప్రభుత్వ హయాంలో ఆదాయానికి అలవాటుపడ్డ వారు మాత్రం మద్యం స్థానంలో సారాను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.  

ఈ ప్రాంతాల్లోనే అధికం 
జిల్లాలో సారా తయారీలో 8 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో సారాను ఓ కుటీర పరిశ్రమగా నడుపుతున్నారు. గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు నగరం, పాలసముద్రం, గంగాధరనెల్లూరు, బైరెడ్డిపల్లె, వాలీ్మకిపురం, పులిచెర్ల, ములకలచెరువు, కుప్పం, ప్రాంతాల్లో సారా తయారీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. రోజూ ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దాడుల్లో 3 వేల లీటర్ల వరకు సారా ఊట ధ్వసం చేస్తూ.. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేస్తున్నారు. 

తెరవెనుక వాళ్లేరి? 
సారా తయారీ, విక్రయాల వల్ల పేదల సంపాదన గంట మత్తు కోసం ఖర్చు పెట్టేస్తుండడంతో పాటు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. మరోవైపు సారా తయారీ, విక్రయాల్లో కూలి పనిచేసే పేదలు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారే తప్ప.. వారికి తెరవెనుక ఉంటూ నడిపిస్తున్న ప్రధాన వ్యక్తులను అధికారులు పట్టుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సారాపై ఉక్కుపాదం మోపాలని, ఎవర్నీ ఉపేక్షించొద్దని అబ్కారీశాఖ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినాసరే అధికారులు మాత్రం చిన్నా చితక కూలీలను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికితోడు ఎక్సైజ్‌ శాఖలో వందకు పైగా కానిస్టేబుల్‌ పోస్టులు దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు వాపోతున్నారు.  

ఎవర్నీ వదలడం లేదు 
సారా తయారీలో కూలీలు, యజమానులు అని తేడా లేదు. తయారీ, విక్రయాల వద్ద అరెస్టు చేస్తున్నవాళ్లు తెలిపే వివరాల ఆధారంగా వారి వెనుక ఉన్నవారిపై కూడా కేసులు పెడుతున్నాం. ఇందుకోసం పోలీసుశాఖ కూడా మాకు బాగా సహకరిస్తోంది. మూడు నెలల్లో 40 శాతం వరకు సారా విక్రయాలు, తయారీని అరికట్టాం  
– నాగలక్షి్మ, డిప్యూటీ కమిషనర్,  ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌   

మరిన్ని వార్తలు