‘అసలే కోతి.. పైగా కల్లు తాగింది’..

12 Jul, 2014 01:52 IST|Sakshi

‘అసలే కోతి.. పైగా కల్లు తాగింది’.. అన్న సామెతను తలపిస్తోంది జిల్లాలో అబ్కారీ శాఖ తీరు. ప్రధాన ఆదాయం సమకూర్చే శాఖ కావడంతో సహజంగానే సర్కారు దీని విషయంలో చూసీచూడనట్లు పోతోంది. అసలే అవినీతి మత్తులో నిత్యం జోగుతుండే ఈ శాఖలోని కొందరు అధికారులు ఇదే అదనుగా మరింత దోపిడీకి తెగబడుతున్నారు. వర్గం, యూనియన్ ప్రతినిధులమన్న తోకలు తగిలించుకొని రెచ్చిపోతున్నారు. అడ్డుచెప్పిన ఉన్నతాధికారులనే ధిక్కరించేలా తోక జాడిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. చివరికి బెల్ట్‌షాపులు, సారా విక్రయాలను అరికట్టాలన్న సర్కారు లక్ష్యానికే తూట్లు పొడుస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలో అక్రమార్జనే ధేయయంగా కొందరు సీఐలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, మద్యం దుకాణాల కేటాయింపులు పూర్తి చేసి అత్యధిక ఆదాయాన్ని లక్ష్యం గా నిర్దేశించడాన్ని అనువుగా తీసుకున్న వీరు మరింత శ్రుతి మించి పోతున్నారు. వీరి ఆగడాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో ఓ కన్నేసినట్టు తెలిసింది. అయితే సామాజికవర్గం పేరు చెప్పుకొని ఒకరు, ఉద్యో గ సంఘాల ప్రతిని దులమంటూ మరి కొందరు జిల్లా అధికారులనే సవాల్ చేస్తున్నారు. జీతం కంటే గీతానికే ప్రాధాన్యమిస్తూ దోపిడీపర్వం సాగిస్తున్నారు.

జిల్లాలో ఇటీవలే 217 మద్యం దుకాణాలను ఇటీవలే లాటరీ పద్ధతిలో కేటాయించారు. రాజాం లోని నాలుగు బార్లు మినహా జిల్లాలోని మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకూ రెన్యూవల్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో జిల్లా వ్యాప్తంగా 14 మంది సీఐలతో పాటు నాలుగు మొబైల్ పార్టీలు, ఎన్‌ఫోర్సుమెంట్ సిబ్బంది వాటి నియంత్రణకు పని చేయాల్సి ఉంది. కానీ మూడు సర్కిళ్లలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
 
ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యం
ఇచ్ఛాపురం సర్కిల్‌లో సిండికేట్లకు దన్నుగా నిలిచిన ఎక్సైజ్ అధికారులు కొత్తవారికి మద్యం దుకాణాలు దక్కకుండా దందా నడిపించారు. పైగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముకోవచ్చని దుకాణదారులకు భరోసా ఇచ్చేశారు. తమ వాటాగా బాటిల్‌కు రూ.2 ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దాంతో వ్యాపారులు క్వార్టర్ బాటిల్‌పై రూ.5, ఫుల్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తూ అందులో రూ.8 అధికారులకు పంపిస్తున్నారని తెలిసింది.

ఇందులో తమకూ కొంత మిగులుతుండటంతో అధికారులు చెప్పినదానికి తలూపుతున్నారు. కాగా తమ వాటా సొమ్ము సక్రమంగా అందుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతిరోజూ జరిగే అమ్మకాల రికార్డులను సర్కిల్ అధికారులు తెప్పించుకొని పరిశీలించి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో 100 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసుతో ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు అప్పగించాల్సిన ఆ కారును అక్కడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత పనులకు వాడుకుంటున్నా రు. ఇటీవల పలాసలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశానికి సైతం అదే కారులో వెళ్లారని కింది స్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు.
 
అలాగే సరిహద్దు ప్రాంతాల్లో సారా బట్ట్టీలను ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఒక్కో బట్టీ యజమాని నుంచి నెలకు రూ.25 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. బెల్టు షాపుల వారికి కూడా ఇక్కడి అధికారి అభయహస్తమిచ్చారని తెలిసింది. ఒడిశా సారా వ్యాపారులను మద్యం వ్యాపార ంలోకి దించేందుకు కూడా అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారాలన్నింటినీ సదరు అధికారి ఓ కానిస్టేబుల్ ద్వారా నడిపిస్తున్నారని తెలిసింది. ఆయన ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోం దని ఎక్సైజ్ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు.  
 
జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణ అధికారుల వ్యవహార శైలిపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్ట్ షాపుల నియంత్రణలో నిర్లక్ష్యం విహ స్తున్నారని ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన ఓ సమావేశంలో సాక్షాత్తూ మంత్రే ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పట్టణ పరిధిలో ఉన్న 40 దుకాణాల్లో నెలవారీ మామూళ్లే రూ.లక్షల్లో ఉంటాయని సిబ్బందే చెబుతున్నారు. కాగా ఈ సర్కిల్ అధికారి ఒక మద్యం వ్యాపారి ద్వారా నెలవారీ మామూళ్లు వసూలు చేయించి విశాఖలో ఉన్న తన ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా పంపిస్తున్నారని తెలుస్తోంది. అబ్కారీ శాఖకు ఆదాయానికే గండి పడే విధంగా వ్యవహరిస్తున్న ఈ అధికారి తనను అడ్డుకోవాలని చూస్తే.. అంతు చూస్తానన్న రీతిలో జిల్లా అధికారులపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే రీతిలో పాతపట్నం సర్కిల్ అధికారులపైనా అరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు