ఉద్విగ్న భరిణెం

14 Feb, 2014 02:01 IST|Sakshi
ఉద్విగ్న భరిణెం
  •      జనం చేరిన అమ్మ ప్రతిరూపం
  •       పులకించిన మేడారం..
  •       ఉప్పొంగిన భక్తిభావం
  •   ఉదయం నుంచే..


     సమ్మక్క రాక సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు దోబె పగడయ్య, సిద్దబోయిన సమ్మయ్య(తండ్రి పొట్టయ్య), సిద్దబోయిన సమ్మయ్య (తండ్రి దానయ్య), మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ గురువారం మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే అడవికి వెళ్లి వనం(వెదురు) తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్లి పూజలు చేసి తల్లిని గద్దెలపైకి చేర్చారు.
     
     అడుగడుగునా నీరాజనాలు


     తల్లి సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తులు అడుగడుగునా ఎదురుకోళ్లతో ఘనస్వాగతం పలికారు. గాలిలోకి కోళ్లు ఎగురవేస్తూ ఆహ్వానించారు. తల్లిపై ఒడి బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దారిపొడవునా బారులుదీరి న భక్తులు తల్లిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రాటపడ్డారు. అమ్మను కళ్లారా చూసి తరించా రు. యాటపోతులు, కోళ్లతో ఎదురెళ్లి బలిచ్చా రు. భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో మేడారం హోరెత్తింది. థింసా నృత్యాలు అలరించాయి.  
     
     పోలీసుల భారీ బందోబస్తు


     పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెకు చేర్చారు. సమ్మక్కను పూజారులు తీసుకుని వస్తుండగా రెండు రోప్‌పార్టీలు రక్షణ ఇచ్చాయి. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐలు దేవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఇతర బలగాలు భద్రత చేపట్టాయి.
     
     అధికారుల ఘనస్వాగతం


     కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ కాళిదాసు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఊరట్టం సర్పంచ్ గడ్డం సంధ్యారాణి,   మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ దూస రాజేశ్వర్‌రావు తల్లికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.39కు ఏకే-47తో రూరల్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. గుట్ట దిగగానే 5.42 గంటలకు, గద్దెల ప్రాంగణానికి వస్తుండగా చిలకలగుట్ట రోడ్డుకు చేరిన సమయంలో, సాయంత్రం 5.55 గంటలకు మరోసారి కాల్పులు జరిపారు.
     
     గుట్టెక్కిన భక్తులు


     చిలకలగుట్ట నుంచి తల్లిని గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు చిలకలగుట్ట ఎక్కారు. పూజారుల పూజా విధానంపై ఆసక్తితో వారు గుట్ట ఎక్కినా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో కిందికి దిగారు. ఇక తల్లిపై వేసిన బియ్యాన్ని ఆమె వెళ్లిపోయిన తర్వాత భక్తులు సేకరించారు. అలాగే గుట్ట సమీపంలోని చెట్ల బెరడును కూడా తీసుకెళ్లారు.
     
     దేవతలను దర్శించుకున్న 30 లక్షల మంది


     తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరగానే సుమారు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గద్దెల వద్ద భక్తజన ప్రవాహం కొనసాగింది. అమ్మలకు ఇష్టమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు కిక్కిరిసింది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 70లక్షలమంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు