చేసేపని మంచిదైతే..అవాంతరాలన్నీ చిన్నబోతాయ్‌..

25 Feb, 2018 13:29 IST|Sakshi

దైవక్షేత్రాల్లో ఈఓ స్థాయి ఉద్యోగం చేయడమంటే కత్తిమీద సామే. అయితే తండ్రి అడుగుజాడలు, భర్త ప్రోత్సాహంతోనే సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నా. చిన్నతనం నుంచి నాకు ఓ ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేంటంటే.. ‘మనం చేసే పని మంచిదైతే అవాంతరాలన్నీ చిన్నబోతాయని’. ఈ సిద్ధాంతాన్ని నమ్మి వృత్తిలో సేవే పరమావధిగా త్రికరణశుద్ధితో పనిచేస్తున్నాను.. అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దర్బముళ్ల భ్రమరాంబ ‘సాక్షి’తో తన భావాలను పంచుకున్నారు.

మాది సంప్రదాయ కుటుంబం. నలుగురు అక్కచెల్లెళ్లం. సొంతూరు విజయనగరం జిల్లా అయినా మా తండ్రి సుబ్బారావు ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడ్డారు. మా కుటుంబంలో కట్టుబాట్లు ఎక్కువే. చదువులకు బయటకు పంపడానికి నాన్న ఒప్పుకునేవారు కాదు. అయితే బలవంతంగా ఒప్పించి మెట్రిక్యులేష న్‌ పూర్తి చేశాను. మా తండ్రి దేవా దాయశాఖలో పనిచేస్తూ 1982లో మృతి చెందారు. మా అక్కచెల్లెళ్లలో ఏ ఒక్కరూ ఆయన స్థానంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురాకపోవడంతో నేను 18 ఏట ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి దేవాదాయశాఖలో వివిధ కేడర్లలో ఉద్యోగం చేసి, ప్రస్తుతం శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నా ను. నా భర్త ప్రసాద్‌ విశాఖపట్నంలో ఎల్‌ఐసీ హయ్యర్‌ గ్రేడ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ పరంగా ఆయన నాకు ఎంతో అండ.

లింగవివక్షతో ఉద్యోగ విరమణకు పూనుకున్నా..
స్వతహాగా మహిళను కావడంతో ఉద్యోగరీత్యా అనేక సందర్భాల్లో నేను లింగవివక్షను ఎదుర్కొన్నాను. ఒకానొ క దశలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 2013లో రాష్ట్ర దేవాదాయ శాఖకు విన్నవించాను. అయితే వారు నా పనితనాన్ని మెచ్చి నా ఉద్యోగ విరమణ దరఖాస్తును తిరస్కరించారు. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా చొరవ తీసుకుని పనిచేసే భావన నాలో పెరిగింది.

బాధ్యతల్లో ఆత్మసంతృప్తి..
విజయనగరం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో అనేక ఒత్తిళ్లు చవి చూశా. అయితే ఉద్యోగ ధర్మమే నన్ను నడిపించింది. విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాను. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మూడుసార్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మద్దతుగా ఉండడంతో పాటు శ్రీకాళహస్తి పాలక మండలి, అధికారుల సహకారంతో మహాకుంభాభిషేకంతో పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేయగలిగా. ఇక ఆలయ మాస్టర్‌ప్లాన్‌ పూర్తిచేస్తే ముక్కంటీశునికి నా సేవ పరిపూర్ణమైనట్లు భావిస్తా.

మరిన్ని వార్తలు