క్షమించు భారతీ

31 Dec, 2013 04:06 IST|Sakshi

 ఏ రంగంలోనైనా ఏటా పురోగతి సాధించడం రివాజు... కానీ జిల్లా విద్యారంగంలో మరింత వెనుకబడిపోయింది. పది ఫలితాల్లో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంటర్‌లో ‘17’ నుంచి చిట్టచివరి స్థానానికి దిగజారింది. విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఆర్వీఎం, విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యావ్యవస్థ నిర్వీర్యమైపోతుందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.           
   - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం  
 
 జిల్లాలో విద్యారంగం అభివృద్ధి నత్తనడకన నడుస్తోంది. ఎంతో ఉన్నతాశయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా ఈ పథకం అమలుపై, పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ అమలుపై కూడా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ప్రకటించనే లేదు. నిధుల మంజూరు కూడా అంతంత మాత్రమే. దీనికి తోడు సర్కారు పథకాలేవీ సమర్థవంతంగా అమలు కాకపోవడంతో విద్యారంగం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. తెలంగాణ, సమైక్య ఉద్యమాల వల్ల ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. కార్పొరేట్ విద్యను అభ్యసించలేక విద్యార్థులు బడిమెట్లు ఎక్కలేకపోయారు. పత్తిచేళ్లు, పంటపొలాల్లో మరోఏడాది బాల్యం గడిచిపోయింది. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రకారం బోధన కొనసాగించాలని ఆదేశాలున్నప్పటికీ, ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చినప్పటికీ పాఠశాలల్లో సీసీఈ ప్రకారం బోధన కొనసాగలేదు.   
 -  న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం
 
  బదిలీలు పదోన్నతులు
   జిల్లా వ్యాప్తంగా 2794 మంది ఉపాధ్యాయులు బదిలీ అవకాశాన్ని దక్కించుకున్నారు.
   ప్రతినెల పదోన్నతుల కౌన్సెలింగ్ చేపడుతుండటంతో ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 700మంది ఉపాధ్యాయులకు పదోన్నతి అవకాశం దక్కింది.
 
   జిల్లాలో  కొత్తగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ కోర్సును ప్రవేశపెట్టి పరీక్షలను కూడా నిర్వహించడంతో ఓపెన్ విధానంతో వయోజనులకు ఇంటర్ చదివే అవకాశం దక్కింది.   ఏప్రిల్ 22న అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించి, 59 మందికి పోస్టింగ్ ఇచ్చారు.  డీఈఓ సుదర్శన్‌రెడ్డి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఏప్రిల్ 26న చంద్రమోహన్ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మే 24న ఆర్వీఎం పీఓ విష్ణువర్ధన్‌రావు బదిలీ కాగా, ఆయన స్థానంలో పద్మహర్ష ఇన్‌చార్జి పీఓగా బాధ్యతలు చేపట్టారు.
 
  ‘పది’లో తొమ్మిదో స్థానం
 పదోతరగతిలో గతేడాది 90.59 శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి కూడా ఉత్తీర్ణత శాతం (91.22) పెరిగినా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 45,897 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41,868 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా గ్రేడింగ్ విధానంలో ఫలితాలు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం పదికి పది (గ్రేడ్1) పాయింట్లు సాధించడం విశేషం.
 
 ఇంటర్‌లో అట్టడుగు..
 ఇంటర్ ఫలితాల్లో ఈ సారి పాలమూరు జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది 57 శాతం ఉత్తీర్ణతతో 17వ స్థానంలో నిలవగా, ఈ సారి 45 శాతంతో చివరి స్థానానికి దిగజారింది. మొత్తం 37,039 మంది పరీక్ష లకు హాజరుకాగా, 16,580 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాల ఉత్తీర్ణతలో జిల్లా 58 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్‌లో 40 శాతంతో చివరిస్థానంలోనే నిలిచింది.
 
 ముఖ్యమైన పోస్టులు ఖాళీ...
   జిల్లాలోని 64 మండలాలకు గాను 50 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు.
   డిప్యూటీ ఈఓలు సైతం డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో విద్యా వ్యవస్థ గాడిన పడటం లేదు.
   అధికారుల అలసత్వం కారణంగా జిల్లాలోని 39 ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 200 ఉపాధ్యాయ పోస్టులకు పైగా ఖాళీ ఏర్పడింది.
 
 నిరుద్యోగులకు తప్పని నిరాశ...
 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడటంతో అభ్యర్థులలో అయోమయం నెలకొంది. రాష్ట్ర విభజన ఉద్యమాలతో ప్రభుత్వం టెట్‌ను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో డీఎస్సీపై  నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలోని వేలాది మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
 
 పంతుళ్లపై క్రిమినల్ కేసులు
 నకిలీ మెడికల్ బిల్లులతో ప్రభుత్వ సొమ్మును కాజేసిన 37 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టారు. విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, ఈ విషయాన్ని బయటపెట్టారు. నవంబర్ 21న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణిమోహన్ ఆదేశాలు జారీ చేశారు.
 
 మి(మ)థ్యాన్న భోజనం
 జిల్లాలోని 3677 సర్కారు బడుల్లోని 4,90,254 విద్యార్థులకు  మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సి ఉంది.  పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు. ఫిబ్రవరి 6న ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కొండనాగుల డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అదే నెల 15న మంత్రి డీకే అరుణ   ఈ పథకంలో జొన్నకిచిడిని ప్రారంభించారు.
 
 పీయూ విశేషాలు
   ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పీయూ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
   పీయూ అభివృద్ధి కోసం * 15 కోట్ల ప్యాకేజీ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.8.9 కోట్లు మంజూరు చేశారు.  
   పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 12 పీజీ కళాశాలలు, 68 డిగ్రీ కళాశాలలు, 2 ఫార్మసీ కళాశాల, 40 బీఈడీ కళాశాలలు, 5ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి.
   పీయూ ప్రిన్సిపల్ పిండి పవన్‌కుమార్‌కు రిసెర్చ్‌లో యూజీ అవార్డు వచ్చింది.
   పీయూలో అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ, పీజీ. ఫా ర్మసీ విభాగాలకు నూతన భవనాలు నిర్మించారు.
 
 ముఖ్య సంఘటనలు...
  గతేడాదికి సంబంధించిన యూనిఫామ్‌లను మాత్రమే ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు సరఫరా చేశారు. ఎంఈఓలు ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై జిల్లా కేంద్రంలోనే యూనిఫామ్స్ కుట్టేందుకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గోదాంలపై దాడి చేసి యూనిఫామ్స్ వస్త్రాన్ని సీజ్ చేశారు.   
   జూన్ 22న ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలు విద్యార్థి సంఘాల నాయకులకు గాయాలయ్యాయి.
   జూలైలో బల్మూర్ కేజీబీవీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
   ఈసారి జిల్లాలోఆరుగురుజాతీయ ఉత్తమఉపాధ్యాయు లుగాఎంపికకాగా,11మందిరాష్ట్రస్థాయి, 42మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్నారు.  
 
  వైఫల్యాలు...
   స్కూల్ కాంప్లెక్సు నిర్వహణ తగిన విధంగా కొనసాగడం లేదు. కిందిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ  లోపం కారణంగా కాంప్లెక్స్‌ల ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు వెనుకబడి పోయాయి.
   రాజీవ్ విద్యామిషన్ పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రవూలు తగిన ఫలితాలు చూపలేదు. అన్నీ మొక్కుబడి కార్యక్రమాలే కొనసాగాయి.
   విద్యార్థుల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం సక్రమంగా అమలు కావడంలేదు.  
   నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం పూర్తిస్థాయిలో బోధన అమలు కావడం లేదు.
   విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కేజీబీవీ, సంక్షేమ హాస్టళ్లు, ఇతర డిపార్ట్‌మెంటుల్లో రాజకీయ పలుకుబడితో ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు.
   పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం, మూత్ర శాలలు, కిచెన్ షెడ్‌లు, ఇతర నిర్మాణాల కోసం నిధులు మంజూరయినప్పటికీనిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి.
   విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది.
  విద్యావ్యాపారాన్నిఅడ్డుకోవడంలోఅధికారులువిఫలమయ్యారు.  
 

మరిన్ని వార్తలు