పలు పరిశ్రమలకు రాయితీలు: పీకే మహంతి

23 Aug, 2013 06:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) పచ్చజెండా ఊపింది. పారిశ్రామిక విధానం 2010-15 మేరకు వ్యాట్‌తో పాటు విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించింది.

 

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వద్ద బ్రెజిల్‌కు చెందిన గెర్‌డావ్ కంపెనీ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే స్టీలు ప్లాంటుతో పాటు రూ. 300 కోట్లతో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటుకానున్న కోల్గెట్ కంపెనీ టూత్‌పేస్టుల తయారీ యూనిట్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 400 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యూనిట్, ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద 800 కోట్లతో ఐటీసీ విస్తరణ ప్లాంటుకు ఎస్‌ఐపీసీ రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

 

అయితే మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద మహీంద్రా అండ్ మహీంద్రా నెలకొల్పనున్న ట్రాక్టర్ల యూనిట్, మోహన్ స్పిన్‌టెక్స్, నల్లగొండ జిల్లాలో ఏర్పాటైన విశాఖ ఆస్‌బెస్టాస్ పరిశ్రమలకు ఇచ్చే వ్యాట్ రాయితీలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమలను ఎస్‌ఐపీసీ ఆదేశించింది.

మరిన్ని వార్తలు