భూమాయలో ఎన్నెన్ని సిత్రాలో!

23 Nov, 2018 03:11 IST|Sakshi

అసైన్డ్‌ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములు కబ్జా

మోసాలు బయటపడకుండా అసైన్‌మెంట్‌ రిజిస్టర్ల మాయం ప్రైవేటు జిరాయితీ  పట్టా భూములుగా  వెబ్‌ల్యాండ్‌లో నమోదు 

భారీ ధరకు అమ్మేసుకుంటున్న కేటుగాళ్లు 

ఒకే భూమికి ముగ్గురి చేతిలో డీకేటీ పట్టాలు

స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ  సైనికుల పేర్లతోనూ అక్రమ పట్టాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను మాయం చేయడంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా బరితెగించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను వినియో గించుకుంటే, అవి తమవేనని నకిలీ పత్రాలు సృష్టించి, నష్టపరిహారం కాజేస్తున్నారు. అసైన్‌మెంట్‌ కమిటీలతో నిమిత్తం లేకుండా అసైన్డ్‌ పట్టాలు సృష్టించి సర్కారు భూములను మింగేస్తున్న వారు కొందరైతే వాటిని వంశపారంపర్యంగా సంక్రమించిన ప్రైవేటు జిరాయితీ పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి, అమ్మేసుకుంటున్న మాయగాళ్లు ఇంకెందరో! నిబంధనలతో, సర్కారు ఉత్తర్వులతో ఎలాంటి సంబంధం లేకుండా ముడుపులిస్తే చాలు రాత్రికి రాత్రే అసైన్‌మెంట్‌ పట్టాలు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. అసైన్‌మెంట్‌ రిజిస్టర్లే మారిపోతున్నాయి. 

ఖాళీగా ఉన్న బంజరుకు ఎన్ని పట్టాలో... 
గతంలో అసైన్‌మెంట్‌ పట్టాలు తీసుకుని సాగు చేయకుండా బంజరుగానే ఉంచిన భూములు అన్ని గ్రామాల్లో ఉన్నాయి.  ఇలాంటి భూములకు  ప్రస్తుత అధికారులు, రిటైర్డు అధికారులు కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ఇతరులకు మళ్లీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకే భూమికి ఇద్దరు ముగ్గురి చేతుల్లో అసైన్డ్‌ పట్టాలు ఉంటున్నాయి. ఒక సర్వే నంబరు (కంపార్టుమెంట్‌)లో 50 ఎకరాల భూమి ఉంటే సబ్‌ డివిజన్‌ చేయకుండానే 130 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సబ్‌ డివిజన్‌ చేయకుండా రెవెన్యూ కార్యాలయాల్లోని పుస్తకాల్లో నమోదు చేయకుండా రిటైర్డు అధికారులు నకిలీ పట్టాలు ఇవ్వడంవల్లే ఈ సమస్య ఏర్పడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, కాసులకు కక్కుర్తిపడి ఇలా చేస్తున్నారని ఒక జిల్లా కలెక్టర్‌ చెప్పారు. 

పట్టాలిప్పించే ముఠాల హల్‌చల్‌  
డబ్బులు తీసుకుని అసైన్‌మెంట్‌ పట్టాలు సృష్టించి ఇచ్చే ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇలాంటి ముఠాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులతోపాటు కొందరు రిటైర్డు అధికారులు కీలక భూమిక పోషిస్తున్నారు. వారి వద్ద ఖాళీ పట్టాదారు పాసుపుస్తకాలు, భూయాజమాన్య హక్కు పత్రాలు, రెవెన్యూ కార్యాలయ స్టాంపులు ఉన్నాయి. నకిలీ పట్టాలు, రికార్డులు సృష్టించే ఈ ముఠాలకు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు దక్కుతున్నాయి. అధికార టీడీపీ నాయకులు అడిగిన పనులు చేసిపెడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. సర్కారు భూములపై నకిలీ హక్కు పత్రాలు ఇచ్చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతోపాటు భూ అనుభవపత్రం (అడంగల్‌), భూ యాజమాన్యపత్రం (1బి)లో కూడా పేర్లు చేర్పిస్తున్నారు. వీటి జిరాక్స్‌ పత్రాలతో మీ–సేవలో, వ్యక్తిగతంగానూ తహసీల్దార్లకు దరఖాస్తు చేసి అన్ని రికార్డులు పక్కాగా ఉన్నాయంటూ మ్యుటేషన్‌ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు) చేయిస్తున్నారు. చాలామంది తహసీల్దార్లకు ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తెలిసినా వారికి ముట్టాల్సింది ముడుతున్నందున రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ప్రొసీడింగ్స్‌ ప్రకారం ఆన్‌లైన్‌ చేస్తున్నారు. 

జిరాయితీ జాబితాలో అసైన్డ్‌ భూములు 
అసైన్‌మెంట్‌ కమిటీల ఆమోదం లేకుండానే అసైన్‌మెంట్‌ (డీకేటీ) పట్టాలు ఇవ్వడమే కాదు, కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఈ డీకేటీ భూములను జిరాయితీ పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన జిరాయితీ పట్టా భూములని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. అసైన్డ్‌ భూములకు అనుభవ హక్కులు తప్ప విక్రయ హక్కులు ఉండవు. అందువల్ల అధికార పార్టీ నాయకులు అసైన్డ్‌ భూములను వంశపారంపర్యంగా సంక్రమించిన పట్టా భూములుగా మ్యుటేషన్‌ పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుంటున్నారు. బినామీ పేర్లతో ఇలా కొట్టేసిన భూములను అమ్మేసి చోటా నాయకులు సైతం రూ.లక్షలు దండుకుంటున్నారు.  

ఫోర్జరీ పత్రాలతో నష్టపరిహారం స్వాహా 
వైఎస్సార్‌ జిల్లాలో గండికోట ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు బయటపడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బుక్కపట్నం మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు  చెక్కా పెద్ద ఓబుళరాజు, చెక్కా ఓబుళమ్మ, చెక్కా రత్నమ్మ, చెక్కా కాంతమ్మ, దాసరి జయలక్ష్మి( ఓబుళరాజు బంధువులు) పేర్లతో ప్రభుత్వ భూమికి నకిలీ డీకేటీ పట్టాలు సృష్టించారు. తమకే చెందిన ఈ భూములు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యాయంటూ ప్రభుత్వం నుంచి రూ.27.78 లక్షల నష్టపరిహారం కొట్టేశారు. నాలుగు రోజుల క్రితమే వారిపై ప్రొద్దుటూరు పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేశారు. 

ఆ రికార్డులన్నీ బోగస్‌ 
వైఎస్సార్‌ జిల్లా బి.కోడూరు మండలం కామకుంటలో డీవీ పార్థసారథి, చిలకపాటి రత్నకుమారికి స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద 19.50 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. వీరికి పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఇవే భూములకు అవే సర్వే నంబర్లతో దేవర్ల శివశంకర్‌రెడ్డి, కుంబాల భాస్కర్‌రెడ్డి, గాజులపల్లె చెన్నకేశవరెడ్డి, వర్ధిరెడ్డి శ్రీనివాసులు పేరిట స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద మళ్లీ పట్టాలు ఇచ్చారు. పైగా స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద పట్టాలు పొందిన వారెవరూ ఉన్న దాఖలాలు కూడా లేవు. దీన్నిబట్టి అప్పట్లోనే ఈ పట్టాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని తేటతెల్లమవుతోంది. మాజీ సైనికులకు ఇచ్చిన పట్టాలైతే పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చనే వెసులుబాటు ఉంది. అందువల్లే ఇలా సృష్టించారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట జారీ చేసిన రికార్డులన్నీ బోగసేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.  

(బాక్స్‌లో పెట్టుకోవాలి)
+ నెల్లూరు జిల్లాలో ఒకే భూమిని తమ పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ ఇద్దరు ముగ్గురు అసైన్‌మెంట్‌ పట్టాలు తీసుకొచ్చి అర్జీలు పెడుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియని తహసీల్దారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడు 100 ఎకరాల భూమికి బినామీ పేర్లతో అసైన్‌మెంట్‌ పట్టాలు పొందాడు. 
+ విజయనగరం జిల్లాకు చెందిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన డి పట్టా భూమి తనదంటూ మరో మాజీ సైనికుడు అధికారులను ఆశ్రయించాడు. 
+ విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ సైనికులకు చెందిన భూమిని అధికార పార్టీ నాయకులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. 
+ కృష్ణా జిల్లాలో ఒక మాజీ సైనికుడికి ఇచ్చిన పట్టా భూమికే తనకూ పట్టా ఉందంటూ ఒకరు వీలునామా రాయించారు. 
+ వైఎస్సార్‌ జిల్లాలో ఒక వ్యక్తి సాగు చేసుకుంటున్న భూమి తనదంటూ మరొకరు పట్టాదారు పాసుపుస్తకం, భూమి హక్కు యాజమాన్య పత్రం అధికారుల వద్దకు తీసుకెళ్లాడు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి బాగోతాలు చోటుచేసుకుంటున్నాయి.  

మరిన్ని వార్తలు