మెట్‌పల్లిలో కలకలం

31 Jan, 2014 04:24 IST|Sakshi

 మెట్‌పల్లి, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాపర్తి గోపాల్‌ను మెట్‌పల్లికి చెందిన రామ్మోహన్ అనే ఎక్సైజ్ ఉద్యోగి అపహరించి హత్య చేసి, మృతదేహాన్ని స్థానిక మాల శ్మశానవాటికలో కాల్చేసినట్టు వెలుగుచూడడంతో పట్టణంలో కలకలం రేగింది. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు శ్మశానవాటికలోని ఓ చితిలో పాక్షికంగా కాలిన కొన్ని శరీరభాగాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాపర్తి గోపాల్ బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఆదిలాబాద్‌లో కిడ్నాప్‌నకు గురయ్యాడు. గోపాల్‌ను మెట్‌పల్లికి చెందిన ఎక్సైజ్ ఉద్యోగి రామ్మోహన్ కిడ్నాప్ చేశాడనే అనుమానంతో ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గోదావరిఖనిలో పనిచేస్తున్న రామ్మోహన్ గతంలో ఆదిలాబాద్‌లో పనిచేశాడు. ఆ సమయంలో కొన్ని ఫైల్స్ మాయం కావడంతో వాటిని అప్పగించాలని గోపాల్ పలుమార్లు రామ్మోహన్‌ను కోరాడు.
 
 ఈ క్రమంలోనే గోపాల్‌పై కక్ష పెంచుకున్న రామ్మోహన్ ఆయనను కి డ్నాప్ చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు ఆదుపులోకి తీసుకొని విచారించారు. గోపాల్‌ను కిడ్నాప్ చేసింది తానేనని ఒప్పుకున్న రామ్మోహన్.. ఆయనను చంపి మృతదేహాన్ని మెట్‌పల్లిలో పడేశానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. స్థానిక మాల శ్మశానవాటికలో బుధవారం అర్ధరాత్రి సమయంలో అప్పటికే కాలుతున్న ఓ చితిపై గోపాల్ మృతదేహాన్ని వేసినట్లు ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందం రామ్మోహన్‌ను తీసుకొని గురువారం మధ్యాహ్నం ఆయన చెప్పినట్లుగా మాల శ్మశానవాటికకు వ చ్చారు.
 
 అక్కడ మృతదేహాన్ని కాల్చిన చితితోపాటు పరిసరాలను పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మెట్‌పల్లి ఠాణాకు చేరుకొని స్థానిక ఎస్సై నటేష్‌తో చర్చించారు. తర్వాత సాయంత్రం 6గంటల సమయంలో చితి వద్ద కాలు, చేయి ఉందనే సమాచారంలో తిరిగి అక్కడికి చేరుకొని పరిశీలించారు. పూర్తిగా కాలిపోకుండా ఉన్న కాలు, చేయి, అవయవాలు లభ్యం కావడంతో వాటిని స్వాధీనం చేసుకొని తమ వెంట తీసుకెళ్లారు. శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
 
 చంపాడా.. దాచాడా?
 గోపాల్ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల అదుపులో ఉన్న రామ్మోహన్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మెట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో గోపాల్ మృతదేహాన్ని పడేసినట్టు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మేడిపల్లి, మల్లాపూర్ మండలం ఓబులాపూర్‌లోని గోదావరినదిలో, ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో పరిశీలించిన తర్వాత మెట్‌పల్లికి వచ్చారు. ఇక్కడ దొరికిన అవయవాల ఆనవాళ్లు గోపాల్‌వేనా? అన్నది తేలాల్సి ఉంది. దీంతో రామ్మోహన్ గోపాల్‌ను దాచాడా..? లేక నిజంగానే చంపాడా? అనే సందేహాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతోనే అసలు నిజం వెల్లడవుతుందని పోలీసులు చెబుతున్నారు.  
 
 తరలివచ్చిన కుటుంబసభ్యులు, సిబ్బంది..
 గోపాల్ మృతదేహం మెట్‌పల్లిలో ఉందనే సమాచారంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, ఎక్సైజ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పట్టణానికి తరలివచ్చారు. మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, ఆదిలాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తోపాటు చెన్నూర్, కాగజ్‌నగర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐలు లక్ష్మణ్, వినోద్ రాథోడ్, నరేందర్‌రెడ్డి, టీఎన్.చారి శ్మశానవాటికకు వచ్చి పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోపాల్ సోదరులు, మిత్రులు వచ్చి ఆచూకీ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. గోపాల్ ఆచూకీ కనుగొని నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
 

మరిన్ని వార్తలు