‘గూడు’కట్టుకున్న ఆశలు

10 Apr, 2017 14:41 IST|Sakshi
‘గూడు’కట్టుకున్న ఆశలు

అప్పన్న భూవివాద పరిష్కారానికి కసరత్తు
1998 నుంచి నేటి వరకు ధరల మార్పులపై ప్రభుత్వం ఆరా
దేవస్థానం భూముల  ధరలపై నివేదిక
{పభుత్వానికి సమర్పించిన కలెక్టర్

 
గోపాలపట్నం : సింహాచల దేవస్థానం భూవివాద పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూముల ధరల నివేదిక కోరడంతో జిల్లా అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో దేవస్థానం భూ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేవస్థాన భూముల పరిధిలో ఉన్న వెంకటాపురం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం, అడివివరం గ్రామాల్లో వేలాది ఇళ్లు, స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. 1999లో దేవస్థానం భూముల్లో నివాసాలుంటున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు నాటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందుకోసం 578 జీఓ విడుదల చేసింది. కానీ అప్పట్లో ఆ భూముల ధరలు భారంగా ఉన్నాయంటూ ఇళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసి ధరలు మార్పు చేయాలని ఉద్యమాలు చేశారు. అదే సమయంలో దేవస్థానం భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ పీఠాధిపదులు రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏకంగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలు, గోపాలపట్నంతో పాటు నగరమంతటా ఉన్న కొండప్రాంతం సర్వే నంబరు 275 వివాదంలో ఉంది. ఈ భూములు కూడా దేవస్థానానివేనని, వీటి నిర్మాణాలను, క్రయ విక్రయాలను అధికారులు అడ్డుకుంటున్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఏటా పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతోంది. మరో వైపు సొంతిళ్లు ఉన్నా అవి తమ భూముల్లోనే ఉన్నాయని దేవస్థానం అధికారులు పెత్తనం చేస్తుండడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలల్లో దేవస్థానం భూ సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దేవస్థానం భూముల ధర రికార్డు సమర్పించాలని కలెక్టర్ యువరాజ్ నుంచి గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు ఆదేశాలు వచ్చాయి. దీంతో 1998 నుంచి ఇప్పటి వరకు పెరిగిన భూముల ధరల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం కోరడంతో పీఠాధిపతులు సానుకూలంగా ఉన్నందున న్యాయస్థానం నుంచి ప్రజలకు అనుకూల తీర్పు వెలువడుతుందని... 578 జీవో ప్రకారమే ధరల నిర్ణయం ఉంటుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
 
ఇప్పుడున్న భూముల ధరలు

గోపాలపట్నం మెయిన్‌రోడ్డు కమర్షియల్ చదరపు గజం రూ25 వేలు ...గోపాలపట్నాన్ని అనుకొని ఉన్న కాలనీల్లో చదరపు గజం రూ. 6 వేల నుంచి రూ.16వేలు బుచ్చిరాజుపాలెం మెయిన్‌రోడ్డు కమర్షియల్ రూ. 28వేలు, ఆనుకొని వున్న కాలనీల్లో చదరపుగజం రూ.12 వేల నుంచి రూ.16 వేలు  వేపగుంట మెయిన్‌రోడ్డు చదరపు గజం రూ.12 వేలు... ఆనుకొని ఉన్న కాలనీల్లో రూ.5800 నుంచి రూ.12 వేలు వరకూ   {పహ్లాదపురం ఏరియా రూ.11వేలు  అడవివరం ఏరియా రూ.11వేలు  పురుషోత్తపురం ఏరియా రూ.6 వేల నుంచి రూ.11 వేలు
 
ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం


దేవస్థానం భూ సమస్య పరిష్కారం కోసమే మేమూ ఎదురు చూస్తున్నాం. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి భూముల ధరలు నివేదించాం. భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇది జరిగితే ప్రజలకు మేలు జరగడంతో పాటు రిజిస్ట్రేషన్ల రూపేణా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుంది. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక లక్ష్యాలూ నెరవేర్చగలం.
 - లక్ష్మీనారాయణ, సబ్‌రిజిస్ట్రార్, గోపాలపట్నం    
 
 గడిచిన ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల తీరిదీ    

సంవత్సరం        {పభుత్వ టార్గెట్       వచ్చింది             
2009-2010    రూ.14 కోట్లు    రూ.9.23 కోట్లు        
2010-11    రూ.15.63 కోట్లు    రూ.22.70 కోట్లు   
2011-12    రూ.27.24 కోట్లు    రూ.16.6 కోట్లు          
2012-13    రూ.27.25 కోటు    రూ.19.92 కోట్లు     
2013-14    రూ.24.85 కోట్లు    రూ.12.36 కోట్లు
2014-15    రూ27 కోట్లు    రూ.10 కోట్లు(ఇప్పటి వరకు)
 
 

>
మరిన్ని వార్తలు