నేడు, రేపు విస్తారంగా వర్షాలు

11 Jun, 2020 04:19 IST|Sakshi
విశాఖ మధురవాడ అప్‌ బ్రిడ్జి వద్ద వాహనచోదకుడి అవస్థ

రాష్ట్రంలో విస్తరిస్తున్న రుతుపవనాలు

కొనసాగుతున్న అల్పపీడనం.. చల్లబడ్డ వాతావరణం 

సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెబ్‌సైట్‌లో ప్రకటించింది. రాయలసీమలో గురువారం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చల్లని గాలులు వీస్తున్నాయి.

మొన్నటి దాకా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో సేదదీరుతున్నారు. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రాగల 36 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు పలు చోట్ల వర్షాలు కురిశాయి. విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది.

మరిన్ని వార్తలు