విస్తరిస్తున్న విశాఖ యాపిల్‌

2 Nov, 2019 04:07 IST|Sakshi

ఇప్పటికే ఏజెన్సీలో 10 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న గిరిజనులు

మరో 10 వేల ఎకరాల్లో సాగుకు కార్యాచరణ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తక్కువ ఉష్ణోగ్రతల్లో పండే యాపిల్‌ రకాల సాగు

సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి ప్రాంతాల్లో యాపిల్‌ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే 10 వేల ఎకరాల్లో యాపిల్‌ సాగు చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాల్లో గిరిజన రైతులతో యాపిల్‌ సాగు చేయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనుంది. 

- వచ్చే జనవరి నుంచి గిరిజన రైతులకు మొక్కల పంపిణీకి శ్రీకారం చుడతారు
ఏడాది వయసున్న ఒక్కొక్క మొక్కకు రూ.250 చొప్పున వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్‌ సాగుకు బాగా అనుకూలం 
- ఇక్కడ ఒక్కో సమయంలో ఉష్ణోగ్రత మైనస్‌ ఐదు డిగ్రీలకు పడిపోతుంది. ఎక్కువ రోజులు సున్నా డిగ్రీలు నమోదవుతుంది
హిమాచల్‌ ప్రదేశ్‌లో పండుతున్న అన్నా, డార్సెట్‌ గోల్డెన్‌ రకాలను ఇక్కడ సాగు చేయిస్తారు
- రైతులు మూడేళ్లపాటు మొక్కలను సంరక్షిస్తే.. అప్పటినుంచి 20 ఏళ్ల వరకు ఫలసాయం వస్తుంది.

యాపిల్‌ సాగుకు అనువైన ప్రాంతం
పాడేరు ఐటీడీఏ పరిధిలోని అరకు లోయ, లంబసింగి, చింతపల్లి, జీకే వీధి గిరిజన గ్రామాలు యాపిల్‌ సాగుకు అనువైనవిగా గుర్తించాం. తక్కువ ఉష్టోగ్రతల్లో పండే యాపిల్‌ రకాలను ఇక్కడ సాగు చేయించాలని నిర్ణయించాం. భూసార పరీక్షలు చేయించి.. వచ్చే ఏడాది జనవరిలో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తాం.
– ఆర్‌పీ సిసోడియా, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ 

మరిన్ని వార్తలు