పోలింగ్ శాతం పెంచుతాం

29 Mar, 2014 00:25 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే కాక, పోలింగ్ శాతాన్ని కూడా గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గంధం చంద్రుడు తెలిపారు. సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
 
 గత ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో 72 శాతం పోలింగ్ నమోదైందని, దానిని 85 శాతానికి పెంచే దిశగా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. స్టిమేటిక్ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్(స్వీప్) అనే కార్యక్రమం చేపట్టి యువత, మహిళలు, ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
 
 ఏర్పాట్లు ఇలా..
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలు, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తాయి. వీటి పరిధిలో 2014 లెక్కల ప్రకారం 13.70 లక్షల ఓటర్లున్నారు.  ప్రస్తుతానికి 1,424 పోలింగ్ కేంద్రాలుండగా, కొత్తగా 77 ప్రతిపాదించారు. ఎన్నికల లోగా కొత్త కేంద్రాలకు అనుమతులు వస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 372  వివిధ బృందాలను ఏర్పాటు చేశారు.
 
వీటిలో స్టేటిక్ సర్వేలెన్స్ బృందాలు 111,  మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిశీలక బృందాలు 79, అభ్యర్థుల ఖర్చు సహాయ పరిశీలకులు 7, అకౌంటింగ్ బృందాలు 10, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 124, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 24, వీడియో వీక్షక బృందాలు 17 ఉంటాయి. ఇవికాకుండా చెక్‌పోస్టులు 24 పనిచేస్తాయి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరు వంతున ఏడుగురు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తారు. వీరి పరిధిలో సహాయ రిటర్నింగ్ అధికారులు 20 మంది, సెక్టోరల్ అధికారులు 121 మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు.
 
పార్లమెంట్ నియోజక వర్గ కేంద్రంలో అదనంగా ఒకటి, ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒకొక్కటి వంతున ఏడు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఉంటాయి. సాధారణ ఎన్నికల పరిశీలకులు పూర్తి ఎన్నికల తతంగాన్ని పరిశీలిస్తారు. ఆయన పరిధిలో అభ్యర్థుల ఖర్చు పరిశీలకులు, పోలీసు శాఖకు చెందిన భద్రత వ్యవహారాల పరిశీలకులు విధులు నిర్వర్తిస్తారు.
 
ఈవీఎంలు సిద్ధం
జిల్లాలో మొత్తం 8,900 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తొలి విడత ఎన్నికల అనంతరం రాజమండ్రికి కావాల్సిన సుమారు 1505 తో పాటు మరిన్ని ఈవీఎంలు రప్పిస్తారు. మొత్తం 1500కు పైగా పోలింగ్ కేంద్రాల్లో గతేడాది 800కు పైగా పీఎస్‌ల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు గుర్తించామని ఆర్‌ఓ తెలిపారు. వాటి పరిధిలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు చెప్పారు.
 
 ధన ప్రవాహానికి అడ్డుక
ట్ట
గ్రామ స్థాయిలో విలేజ్ లెవల్ అవేర్‌నెస్ బృందాలు, వార్డు స్థాయిలో వార్డు లెవల్ అవేర్‌నెస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇద్దరు మహిళలతో పాటు రాజకీయేతర స్వచ్ఛంద సేవా దృక్పథం కలిగిన 8 నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. వీరు గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచుతారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు దోహదపడతారని ఆర్‌ఓ వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎవరైనా తగిన లెక్కలు చూపి, రూ. 2.5 లక్షల వరకు నగదు తీసుకువెళ్లవచ్చని స్పష్టం చేశారు.
 
 షెడ్యూల్ ఇలా..

ఏప్రిల్ 12న ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారు. 19న నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. 21న నామినేషన్ల పరిశీలన అనంతరం 23న ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. మే 7న పోలింగ్, 16న కౌంటింగ్ జరుగుతుంది. అభ్యర్థుల ఖర్చు పరిధిని అసెంబ్లీకి రూ.40 లక్షలు, పార్లమెంట్‌కు రూ.70 లక్షలకు పెంచినట్టు ఆర్‌ఓ వివరించారు.

>
మరిన్ని వార్తలు