పోలవరం అక్రమాలపై ‘రివర్స్‌’ పంచ్‌

2 Aug, 2019 03:09 IST|Sakshi

హెడ్‌ వర్క్స్‌ నుంచి నవయుగ ఔట్‌!

గేట్ల తయారీ నుంచి బీకెమ్‌ కూడా..పనుల నుంచి వైదొలగాలని నోటీసులు జారీ చేసిన పోలవరం సీఈ

జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నవయుగకు ఏపీ జెన్‌కో తాఖీదులు

హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.2,346.85 కోట్ల 

అక్రమాలను నిర్ధారించిన కమిటీ 

నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం

హెడ్‌ వర్క్స్‌ పనులకు కొత్తగా టెండర్ల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ

హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌కు కసరత్తు

‘రివర్స్‌’తో భారీగా ప్రజాధనం  ఆదా అవుతుందంటున్న జలవనరుల శాఖ, జెన్‌కో వర్గాలు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. హెడ్‌వర్క్స్‌(జలాశయం) పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్‌ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నామినేటెడ్‌ ఎల్‌.ఎస్‌. కాంట్రాక్టు ఒప్పందంలో జీసీసీ (జనరల్‌ కండిషన్స్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌) 89–3 క్లాజ్‌ ప్రకారం ఒప్పందాన్ని ముందుగానే రద్దు (ప్రీ–క్లోజ్‌) చేసుకోవాలని సూచిస్తూ నవయుగ, బీకెమ్‌లకు పోలవరం ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు జూలై 29న నోటీసులు జారీ చేశారు. ఒప్పందం రద్దు కోసం పరస్పర అంగీకారాన్ని తెలియచేస్తూ 15 రోజుల్లోగా తమను సంప్రదించాలని పేర్కొన్నారు.

కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడే ఆర్థికపరమైన లావాదేవీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని పేర్కొంటూ నవయుగ సంస్థకు ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి సంస్థ) నోటీసులు జారీ చేసింది. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్‌ శక్తి శాఖలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. 

కమీషన్ల కోసమే ప్రాజెక్టు బాధ్యతలు.. 
విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వంద శాతం ఖర్చు భరించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ కమీషన్ల దాహంతో మాజీ సీఎం చంద్రబాబు పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టడంతో పోలవరం బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.

పోలవరం హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియక ముందే నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని రూ.1331.91 కోట్లు పెంచేస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లబ్ధి చేకూర్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్‌ట్రాయ్‌ 2017 నాటికి దివాలా తీసింది. నిబంధనల ప్రకారం దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలి.

‘డబ్బుల్‌’ ధమాకా..
పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగకే కట్టబెట్టాలని ముందుగానే నిర్ణయించిన చంద్రబాబు 2017 జనవరి 7న ఏపీ జెన్‌కోతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. నిబంధనల సాకుతో 4.83 శాతం అధిక (ఎక్సెస్‌) ధరకు అంటే రూ.3,220.22 కోట్లకు కోట్‌ చేసిన నవయుగ సంస్థకు ఆ పనులు కట్టబెడుతూ 2017 డిసెంబర్‌ 30న ఏపీ జెన్‌కో ఒప్పందం చేసుకుంది. నిజానికి పోలవరం హెడ్‌వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులు అంతర్భాగమే. హెడ్‌వర్క్స్‌ ప్రధాన  కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ దివాలా తీసిన నేపథ్యంలో ఆ పనులనూ నవయుగకే అప్పగించి అటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం, ఇటు హెడ్‌వర్క్స్‌లో కమీషన్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్‌ వేశారు.

ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే 60సీ నిబంధన కింద రూ.2,914.66 కోట్ల విలువైన పనులను ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తూ మూడు ఒప్పందాలను చేసుకున్నారు. ఇదే రీతిలో గేట్ల పనులను 60సీ నిబంధన కింద విడదీసి రూ.387.56 కోట్ల పనులను బీకెమ్‌ సంస్థకు నామినేషన్‌ విధానంలో అప్పగిస్తూ 2018 నవంబర్‌ 8న మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడైంది.

తేలిన అక్రమాలు..
టీడీపీ హయాంలో ఇంజనీరింగ్‌ పనుల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ ఆర్థికంగా దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో నాటి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈపీసీ ఒప్పందం గడువు ముగియకుండానే అంచనా వ్యయాన్ని పెంచేయడం, నవయుగ, బీకెమ్‌ సంస్థలకు ఎల్‌ఎస్‌ ఓపెన్‌ పద్ధతిలో నామినేషన్‌ విధానంలో పనులు అప్పగించడం, జీవో 22, జీవో 63 కింద అదనపు చెల్లింపులు చేయడం, స్పెషల్‌ ఇంప్రెస్ట్‌ అమౌంట్‌ కింద విడుదల చేసిన రూ.170 కోట్లకు లెక్కలు చూపకపోవడం, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో తట్టెడు కూడా మట్టెత్తకుండానే రూ.787.20 కోట్లను దోచిపెట్టడాన్ని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.2,346.85 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారిస్తూ నిపుణుల కమిటీ గత నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల పనుల్లో సమన్వయం కుదురుతుందని, రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యపడుతుందని పేర్కొంది.

కమిటీ సిఫార్సుల మేరకు నోటీసులు..
ట్రాన్స్‌ట్రాయ్‌తో 2013 మార్చి 2న జరిగిన ఈపీసీ ఒప్పందాన్ని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా నవయుగ, బీకెమ్‌ సంస్థలతో రూ.3,302.22 కోట్ల విలువైన పనులను ఎల్‌ఎస్‌–ఓపెన్‌ పద్ధతిలో నామినేషన్‌పై అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడం,  డీజిల్‌ కొనుగోలుకు రూ.50 కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడం, స్టీలు, సిమెంట్‌ను గత ప్రభుత్వమే కాంట్రాక్టర్‌కు సరఫరా చేయడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో నవయుగతో చేసుకున్న మూడు ఒప్పందాలు, బీకెమ్‌ సంస్థతో చేసుకున్న మరో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

నోటీసులు జారీ చేసినప్పటి నుంచే అంటే జూలై 29 నుంచి 15 రోజుల్లోగా అంటే ఆగస్టు 12లోగా ఆ ఒప్పందాలను పరస్పర అంగీకారంతో ముందస్తుగా రద్దు చేసుకోవడానికి అంగీకరిస్తూ పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ను సంప్రదించాలని ఆ రెండు సంస్థలకు సూచించింది. ఈ పనులకు పారదర్శక విధానంలో కొత్తగా టెండర్లు నిర్వహిస్తామని నోటీసుల్లో పేర్కొంది. కాంట్రాక్టు ఒప్పందం చేసుకుని ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేస్తూ మే 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పనులు ప్రారంభించని జలవిద్యుదుత్పత్తి కేంద్రం కాంట్రాక్టు ఒప్పందం కూడా రద్దు అయినట్లే లెక్క. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ నవయుగకు ఏపీ జెన్‌కో నోటీసులు జారీ చేసింది.


రివర్స్‌ టెండరింగ్‌కు కసరత్తు..
నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీపీఏ గెజిట్‌ నోటిఫికేషన్‌ సెక్షన్‌ 9–1 ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నా కేంద్ర జల్‌ శక్తి, పీపీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌లకు సోమవారం లేఖ రాయనున్నారు.

పోలవరం బాధ్యతలను గత ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాక పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థతో హెడ్‌ వర్క్స్‌ పనులకు జలవనరుల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఏపీ జెన్‌కో ఒప్పందం చేసుకోనున్నాయి. ఆయా పనులు చేసిన మేరకు జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కోలు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించనున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు