ఉద్దానం కిడ్నీ జబ్బులకు అదే కారణం

15 Nov, 2019 08:44 IST|Sakshi

ఉద్దానంలో కిడ్నీ జబ్బులకు 

భార లోహాలే ప్రధాన కారణం

తాజా అధ్యయనంలో నిపుణుల వెల్లడి

టెరీ, ఐసీఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వ 

సంయుక్త ఆధ్వర్యంలో అధ్యయనం

సాక్షి, అమరావతి: భూగర్భ జలాల్లో భారలోహాలు మోతాదుకు మించి ఉండటమే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బులకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. టెరీ (ద ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కిడ్నీ సమస్యలు తలెత్తడానికి కారణాలపై సుమారు 40 గ్రామాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేసింది. ప్రధానంగా లెడ్, ఐరన్, కాడ్మియం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్‌ సిలికా లాంటి భార లోహాలు తాగునీటిలో మోతాదుకు మించి ఉండటం వల్లే మూత్రపిండాల జబ్బుల బారినపడుతున్నట్లు అధ్యయనంలో ప్రాథమికంగా తేల్చారు. ఉద్దానంతో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలోనూ నీటిపై అధ్యయనం చేశారు. రెండు చోట్లా భూగర్భ జలాలు, ఆర్వో ప్లాంట్లు, వరిపైరుకు సరఫరా అయ్యే నీరు, రొయ్యల సాగుకు వినియోగించే నీరు ఇలా పలురకాల జలాలపై అధ్యయనం జరిపారు.

జీఎఫ్‌ఆర్‌పై తీవ్ర ప్రభావం
తాగునీరు, తినే ఆహారంలో భార లోహాలు (హెవీ మెటల్స్‌) ఉండటం వల్ల కిడ్నీలు నిర్వర్తించే వడపోత (జీఎఫ్‌ఆర్‌)పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఆహారం, నీరు తరచూ తీసుకోవడం వల్ల కొద్ది సంవత్సరాల్లోనే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 
‘ఉద్దానంలో కిడ్నీ జబ్బులకు కొన్ని భార లోహాలు కారణమని పరిశోధనలో తేలింది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. నిర్దిష్ట కారణాన్ని కచ్చితంగా కనుగొనే వరకూ అధ్యయనం కొనసాగుతుంది’   –డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి (వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి)

మోతాదు దాటిన   భార లోహాలు

  •  లీటరు నీటికి సిలికా 40 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదు. కానీ ఉద్దానంలో గరిష్టంగా 303 మిల్లీ గ్రాములు ఉంది. సిలికా ప్రభావం వల్ల తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
  •  ఐరన్‌ ధాతువు లీటరు నీటికి 0.3 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదు. కానీ ఉద్దానంలో గరిష్టంగా 4.98 మిల్లీ గ్రాములు ఉంది. 
  • టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) పరిమాణం లీటరు నీటికి 500 మిల్లీ గ్రాములకు మించి ఉండకూదు. ఉద్దానంలో ఇది గరిష్టంగా 1,400 మిల్లీ గ్రాములు ఉంది.
  • మచిలీపట్నంతో పోలిస్తే ఫ్లోరైడ్‌ శాతం ఉద్దానంలో అధికం.
  • అల్యూమినియం మోతాదు మచిలీపట్నంతో పోల్చితే ఉద్దానంలో తక్కువగా ఉంది.
  •  రన్, మాంగనీస్‌ లోహాల మోతాదు మచిలీపట్నంతో పోల్చితే ఉద్దానం గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంది
  •  ఉద్దానం భూగర్భ జలాల్లో పాథలేట్స్‌ (ప్లాస్టిక్‌ పొల్యూషన్‌) కాలుష్యం ఎక్కువగా ఉంది.
  •  ఉద్దానం ప్రజలు వినియోగించే వరిధాన్యంలో అల్యూమినియం, క్రోమియం, బేరియం, నికెల్, ఆర్సెనిక్‌ మోతాదు మచిలీపట్నంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు