మహిళా ఖైదీల స్థితిగతులపై అధ్యయనం

17 Jul, 2018 12:03 IST|Sakshi
ఖైదీల పిల్లలతో మాట్లాడుతున్న ఎక్స్‌పర్ట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పూనం మాలకొండయ్య

సెంట్రల్‌ జైలును సందర్శించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ

ఆరిలోవ (విశాఖపట్నం): విశాఖ కేంద్రకాగారాన్ని ఎక్స్‌పర్ట్‌ కమిటీ సోమవారం సందర్శించింది. ఈ కమిటీలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కమిటీ చైర్‌పర్సన్‌ పూనం మాలకొండయ్య, సభ్యులు డబ్ల్యూసీడీఏ అండ్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ కె.సునీత, ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ వై.వి.అనురాధ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ కె.సంధ్యారాణి, కాలేజి ఎడ్యుకేషనల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ సుజాత శర్మ, డబ్ల్యూడీ అండ్‌ సీబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌.అరుణ జైల్‌ను సందర్శించిన కమిటీలో ఉన్నారు. ఇక్కడ జైల్‌లో ఎంతమంది మహిళా ఖైదీలుంటున్నారు, వారు ఏఏ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు, వారికి ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ముందుగా జైల్‌ పర్యవేక్షణాధికారి ఎస్‌.రాహుల్‌ని అడిగి తెలుసుకొన్నారు.

అనంతరం మహిళా ఖైదీలు ఉండే బ్యారక్‌కు వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళా ఖైదీలతో కమిటీ సభ్యులు వేర్వేరుగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఆహారంలో నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. వారు ఏఏ కేసుల్లో జైలుకు వచ్చారో అడిగి తెలసుకొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మహిళా ఖైదీల పిల్లలతో మాట్లాడారు. వారికి ఇక్కడ ఉన్న ఇబ్బందులు, వారి చదువు ఎలా సాగుతోంది తదితర వాటిని అడిగారు. జైల్‌ ఆస్పత్రి, ఇతర బ్లాకులు పరిశీలించారు. వారితో జైల్‌ డిప్యూటీ సూపరిం టెండెంట్‌ ఎం.వెంకటేశ్వర్లు, జైలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు