అను‘మతి’ ఉండే చేస్తున్నారా..?

16 Aug, 2018 13:05 IST|Sakshi

పిల్లల ప్రాణాలతో చెలగాటమా!

కాలం చెల్లిన బస్సులతో ప్రమాదాలు

స్కూళ్లపై చర్యలకు అధికారులు వెనకడుగు

చిత్తూరు అర్బన్‌: ధనార్జనే ధ్యేయంగా వెలుస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఏ మాత్రం నియమ నిబంధనలను పట్టించుకోవడంలేదు. కాలం చెల్లిన బస్సుల్లో పసి పిల్లల్ని కుక్కేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. మామూళ్లు తీసుకోవడం.. ఒత్తిళ్లకు తలొగ్గడానికి అలవాటు పడ్డ రవాణాశాఖ అధికారులు అభంశుభం తెలియని పిల్లల రక్తం కళ్ల చూస్తున్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి ఏటా జూన్‌ 12వ తేదీలోపు పిల్లల్ని తీసుకెళ్లే బస్సులు, వ్యాన్లకు ఏడాది వరకు రవాణాశాఖ అధికారులు సామర్థ్యపు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. పిల్లలు విద్యాసంస్థల బస్సుల్లో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి ప్రతి వాహనానికి ఎఫ్‌సీ తప్పనిసరి. కండీషన్‌ లేని బస్సులతో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అందుకే సంవత్సరానికి ఓ సారి పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల కండీషన్‌ను మోటారు వాహన తనిఖీ అధికారులు (ఎంవీఐ) పరిశీలిస్తారు. బస్సుల టైర్లు, వేగం, ఇంజిన్‌ సామర్థ్యం లాంటివి తనిఖీ చేసిన తరువాతే ఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. జిల్లాలోని చాలా మంది ఎంవీఐలు స్కూల్‌ బస్సుల కండీషన్‌ తనిఖీ చేసే సమయంలో బస్సుకు ఓ రేటును మాట్లాడుకుని మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 30 శాతం వరకు విద్యా సంస్థల వాహనాలు సరైన కండీషన్‌లో లేకనే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.

ఎఫ్‌సీ కోసం వచ్చే విద్యాసంస్థల బస్సులో తప్పనిసరిగా జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌) పరికరాన్ని ఉంచాలని ఈ సారి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. విద్యార్థుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జీపీఎస్‌ పరికరం తప్పనిరయ్యింది. ప్రస్తుతం 500లకు పైగా బస్సులు ఎఫ్‌సీలు లేకుండా, జీపీఎస్‌ పరికరాలు పెట్టుకోకుండా యథేచ్ఛగా వాహనాల్లో విద్యార్థులను ఎక్కించుకుని తిప్పుతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.

ఎఫ్‌సీలు ఏవీ..
జిల్లాలో 2,235 స్కూల్‌ బస్సులు ఉన్నాయి. చిత్తూరు ప్రాంతీయ రవాణ శాఖ పరిధిలో 1,121 స్కూల్‌ బస్సులు, తిరుపతి పరిధిలో 1,104 వరకు బస్సులున్నాయి. గతేడాది ఎఫ్‌సీ పత్రాలు తీసుకున్న బస్సులకు ఈ ఏడాడి జూన్‌ 15వ తేదీ నాటికి గడువు ముగిసింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇవి రోడ్లపైకి రావడానికి వీల్లేదు. అలాగే 15 ఏళ్లు దాటిన స్కూల్‌ బస్సులు విద్యార్థులను ఎక్కించుకోవడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే విద్యాసంస్థల నిర్వాహకులు వాహనాలను కండీషన్‌లో ఉంచుకుని, రిపేర్లు పూర్తి చేసి రవాణ శాఖ నుంచి మరో ఏడాది చెల్లుబాటుకు ఎఫ్‌సీ తీసుకోవాలి. జిల్లాలోని 200లకు పైగా బస్సులకు ఎఫ్‌సీలు లేవు. సామర్థ్యంలేని బస్సుల్లో పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకువెళుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేయాల్సిన అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి రవాణాశాఖ అధికారులకు ఒత్తిళ్లు వస్తుండడమే ఇందుకు కారణం.

క్రిమినల్‌ కేసు పెడతాం
మా రికార్డుల ప్రకారం 120 వరకు బస్సులకు ఎఫ్‌సీలు లేవు. ఇవి రోడ్లపైకి కూడా రావడంలేదు. మా వాళ్లు తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఎఫ్‌సీలు లేకుండా బస్సుల్లో పాఠశాలల పిల్లల్ని ఎక్కిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అంతేగాక పాఠశాలల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం.  
– ప్రతాప్, ఉప రవాణ కమిషనర్,

మరిన్ని వార్తలు