వైభవంగా హనుమజ్జయంతి

24 May, 2014 03:18 IST|Sakshi
వైభవంగా హనుమజ్జయంతి
  • జపాలిలో కిట కిటలాడిన భక్తులు
  •  తిరుమల, న్యూస్‌లైన్: తిరుమలలో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది హనుమజ్జయంతిని తిరుమల పాపవినాశనం మార్గంలోని జపాలిలో వేడుకగా  నిర్వహించడం అనవాయితీ.  శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేకువజాము నుంచే ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు.

    ఆంజనేయస్వామి మాలను ధరించి దీక్ష  చేప్పటిన భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. జై సీతారామ్ అంటూ నామస్మరణ చేస్తూ ఆంజనీపుత్రుని సేవలో తరించారు. అంతకుముందు హథీరామ్ జీ మఠం మహంత్ అర్జున్‌దాస్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీఆంజనేయస్వామిని ప్రత్యేక పుష్పాలను అలంకరించి సర్వాంగ సుందరంగా అలంకరించారు.

    అభిషేకాలను, ఇతర పూజలను నిర్వహించారు. అలాగే శ్రీవారి ఆల యం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి ఉదయం 9గంటలకు ఆభిషేకాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పాలుతో అభిషేకాన్ని నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డు  ఏడోమైలు వద్దనున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    శరణాగత ప్రపత్తికి, దాసభక్తికి ప్రతీక హనుమంతుడు...
     
    దాస భక్తికి ప్రతీకైన ఆంజనేయస్వామి భక్తాగ్రేసురుల్లో అత్యంత ఉత్కృష్ణమైనవారని టీటీడీ చైర్మన్ బాపిరాజు పేర్కొన్నారు. టీటీడీ తరుపున ఆంజనేయస్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ శరణాగతే జీవన పరమావధిగా చేసుకున్న భక్తాగ్రగణ్యుడు హనుమంతుడన్నారు.

    జీవితాంతం రామనాస్మరణే ధ్యేయంగా మలచుకుని నేటికీ చిరంజీవిగానే ఉంటూ తన భక్తుల కోరికలను తీరుస్తున్న కల్పతరువుగా ఆంజనేయస్వామి ప్రసిద్ధిగాంచినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం జపాలిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ జపాలీ తీర్ధానికి చేరుకుని హనుమంతుడిని దర్శించుకుంటున్నారని చెప్పారు.
     

మరిన్ని వార్తలు