దురంతో ఇక దగ్గరగా..

17 Jul, 2014 00:54 IST|Sakshi
దురంతో ఇక దగ్గరగా..
  •     ప్రయాణికులకు అనుకూలంగా వేళల మార్పు
  •      సెప్టెంబర్ నుంచి అమలు
  •      తెల్లారేసరికి రాజధాని చేరిక
  •      ఇక దురంతో వైపు అందరూ మొగ్గు
  • విశాఖపట్నం :  హైదరాబాద్ వెళ్లాలంటే అందరికీ గుర్తుకొచ్చేది గోదావరి ఎక్స్‌ప్రెస్. సమయపాలనలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ ట్రెయిన్ విశాఖ స్టేషన్‌లో నంబర్ వన్. ఇక్కడ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం నుంచి బయల్దేరి రాజధానిలోనూ అదే నంబర్ ప్లాట్‌ఫారంలో ఆగుతుంది. సాయంత్రం బయల్దేరి ఆరునూరైనా తెలతెలవారుతుండగా ప్రయాణికులను హైదరాబాద్‌లో దించేస్తుంది. వీఐపీలంతా ఈ రైలుకే ప్రియారిటీ ఇస్తారు.  

    అత్యంత వేగంగా ప్రయాణించే నాన్‌స్టాప్ ట్రెయిన్ దురంతో ఎక్కుదామంటే ఉదయాన్నే రాజధానికి చేరుకోలేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రాబోతుంది. గోదావరిని కాదని జనం దురంతో వైపు అడుగులేయబోతున్నారు. గోదావరి కంటే ముందుగా హైదరాబాద్‌కు చేరుకోబోతోంది.  రాజధానికి మూడేళ్ల క్రితం దురంతో ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు భారీగా ఉన్న రద్దీని తగ్గించాలనే ప్రయత్నంతోనే ఈ రైలును తీసుకొచ్చారు. వారానికి మూడు రోజుల పాటు ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబర్ నుంచీ గోదావరి ఎక్స్‌ప్రెస్ కన్నా ముందుగానే సికింద్రాబాద్‌కు చేరుకునేలా రాకపోకల్లో మార్పులు చేశారు.

    ప్రస్తుతం విశాఖలో ఈ రైలు 10.30 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాలి. కానీ అరగంట ఆలస్యంగానే చేరుకుంటుంది. దీంతో వీఐపీలంతా ఈ రైలు వేళలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాన్‌స్టాప్ రైలుగా పేరుగాంచిన దురంతో ఎప్పుడూ ఆలస్యంగానే గమ్యానికి చేరుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన రైల్వే అధికారులు ఎట్టకేలకు రాకపోకల వే ళలు మారిస్తే గానీ ప్రయోజనం ఉండదని గుర్తించారు.

    అందుకే ఈ రైలు వేళల్ని  రాత్రి 10.30 గంటలకు బదులు రాత్రి 8.15 గంటలకే బయల్దేరేలా రైల్వే టైంటేబుల్ పట్టిక లో మార్పు చేశారు. అంతేకాదు గోదావరి మాదిరిగా ఉదయం 6 గంటల్లోగానే సికింద్రాబాద్ చేరుకుంటుంది. గోదావరి కన్నా దాదాపు 3 గంటలు ఆలస్యంగా బయల్దేరి ఆ రైలుతో సమానంగా గమ్యానికి చేరుతుండడంతో ఇకపై ఎక్కువ మంది దురంతోనే ఆశ్రయిస్తారని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.
     

>
మరిన్ని వార్తలు