టీడీపీలో ‘కళా’కలం!

3 Apr, 2017 12:07 IST|Sakshi
టీడీపీలో ‘కళా’కలం!

► కళాకు మంత్రి పదవిపై రేగిన అసంతృప్తి
► అలకబూనిన సీనియర్‌ నాయకుడు శివాజీ
► గౌతు కుటుంబం రాజీనామాపై వదంతులు
► ‘కాళింగు’లకు ప్రాధాన్యలోపంపైనా చర్చలు  


సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: టీడీపీలో వర్గపోరు మొదలైంది. కింజరాపు కుటుంబానికి బద్ధ వ్యతిరేకిగా ముద్ర పడిన కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ఇద్ద రు మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరా వుల మధ్య వైరం చూస్తే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు ‘ఒక్క చాన్స్‌’ అంటూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్‌ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీకి భంగపాటు కలగడంతో ఆయన అలక పాన్పు ఎక్కారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒక్కసారి మంత్రిగా పనిచేసినా కనీసం ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలనలోకే తీసుకోకపోవడం గమనార్హం. అలాగే తమకు సరైన గుర్తింపు ఇవ్వలేదంటూ జిల్లాలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన కాళింగులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారిని పక్కనబెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, మరో పార్టీలోకి వెళ్లి తర్వాత సొంతగూటికి చేరినవారికే అధిష్టానం గుర్తింపు ఇస్తోందంటూ టీడీపీ వర్గాలు రగిలిపోతున్నాయి. కింజరాపు కుటుంబంతో దీర్ఘకాల వైరం ఉన్న కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడంతో కళా సఫలమయ్యారు. దీంతో జిల్లాలో ఎంతమంది వ్యతిరేకించినా కళాకు మంత్రి పదవి ఖాయమైంది. అంతవరకూ బాగానే ఉన్నా పోర్టుపోలియో ఏమి దక్కుతుందనేదీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్‌టీ రామారావు కేబినెట్‌లో హోమ్‌ మంత్రిగా పనిచేసిన కళాకు మళ్లీ హోంశాఖ ఇస్తారనే ధీమాలో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడమే ప్రాతిపదికగా మార్కులు ఇస్తున్న అధిష్టానం... ఆ కోణంలో చూస్తే అచ్చెన్నాయుడికి హోంశాఖ కట్టబెట్టి అధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచర వర్గం గట్టిగా నమ్ముతోంది.

పాత తగదాలు తెరపైకి...
దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడికి సొంతపార్టీలోనే కళా వెంకటరావు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండేది. వాస్తవానికి ఎచ్చెర్ల నుంచి గెలిచిన కళాకు ప్రారంభంలోనే మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇది సీనియర్‌ నాయకుడు శివాజీ వర్గానికి అశనిపాతమైంది. అప్పుడే ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఈ ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వాలని 2014 ఎన్నికల సమయంలోనే శివాజీ షరతు పెట్టినా అధిష్టానం పట్టించుకోకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఆయన కుమార్తె శిరీషకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టి తాత్కాలికంగా శాంతింపజేశారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నూ శివాజీకి మొండిచేయి చూపడాన్ని గౌతు కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ పదవికి రాజీ నామా చేయడానికి సైతం శిరీష సిద్ధమయ్యారంటూ వదంతులు వచ్చాయి. తనకు కాకుండా కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో శివాజీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన కాళింగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విప్‌కు కూన రవికుమార్‌కు మంత్రి పదవి లేదా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి అయినా ఇస్తారని ఆ శించినా అవేవీ నెరవేరలేదు.

ఇక హోంశాఖ కోసం కళా వెంకట రావు, అచ్చెన్నాయుడి మధ్య తీవ్ర పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కళా వెంకటరావు ప్రమాణస్వీకారం చేసినా రాత్రి వరకూ పోర్టుపోలియో ప్రకటించకపోవడంతో ఎవ్వరికి హోం దక్కుతుందనే విషయంలో జిల్లాలో ఆసక్తిగా మారింది. ఒకవేళ కళా కే హోంశాఖ ఇస్తే కింజరాపు కుటుంబంపై ఆయన ఆధిపత్యానికి గండి పడుతుందనే చర్చ నడుస్తోంది. అలాగే ప్రతిపక్షంపై విరుచుకుపడటంలో చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసిన అచ్చెన్నాయుడికే హోంశాఖతో ప్రమోషన్‌ ఇస్తారని ఆయన అనుచర గణం గట్టిగా చెబుతోంది. ఎవ్వరికి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి మరి.

మరిన్ని వార్తలు