ఐదింటిపై మూడో కన్ను

12 Jun, 2019 04:03 IST|Sakshi

థర్డ్‌ పార్టీ విచారణ అంశాల పరిధి పెంపు 

సాగునీటితోపాటు రాజధాని, పురపాలక, పంచాయతీరాజ్,రహదారులు భవనాల శాఖ పనులపైనా విచారణ  

ఐదుకు పెరిగిన థర్డ్‌ పార్టీ సభ్యుల సంఖ్య 

నేడో రేపో అధికారిక ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు థర్డ్‌ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్‌సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్, నాక్‌ డైరెక్టర్‌ పీటర్‌లను థర్డ్‌ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. 

పేదల ఇళ్లలోనూ కమీషన్ల పర్వం..
టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల తరహాలోనే తాత్కాలిక సచివాలయం, శాశ్వత పరిపాలన భవనాలు, రహదారుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీగా కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు అంచనా వ్యయాన్ని సగటున కి.మీ.కి రూ.59 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించడమే దీనికి తార్కాణం. తాత్కాలిక సచివాలయం, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిలో అంచనాలు పెంచేశారు. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో వాటర్‌ గ్రిడ్, ఏఐడీబీ (ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు) రుణంతో చేపట్టిన రహదారుల పనుల్లోనూ అంచనా వ్యయాన్ని పెంచేసి భారీగా  దోచుకున్నారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే మాదిరిగా దోపిడీ జరిగింది. పురపాలక శాఖలో ప్రధానంగా పీఏంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.20,535 కోట్ల నుంచి రూ.38,265.88 కోట్లకుపైగా పెంచేసి లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల రుణభారాన్ని మోపి టీడీపీ పెద్దలు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలను థర్డ్‌ పార్టీ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

థర్డ్‌ పార్టీ విచారణకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. అవి ఇలా ఉన్నాయి..
- శాఖలవారీగా, ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను థర్డ్‌ పార్టీ పరిశీలించాలి.
ఒక ప్రాజెక్టు డీపీఆర్‌ ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేక  డీపీఆర్‌ను రూపొందించకుండా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? అన్నది తేల్చాలి.
అంచనా వ్యయాన్ని ఖరారు చేసేటప్పుడు పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా అమాంతం పెంచేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. 
ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో టెండర్‌ పిలిస్తే ఐబీఎం(ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ కమిటీ)ను, లంప్సమ్‌(ఎల్‌ఎస్‌)–ఓపెన్‌ విధానంలో టెండర్‌ పిలిస్తే చీఫ్‌ ఇంజనీర్స్‌ కమిటీలను సంప్రదించి అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలి.
టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేటప్పుడు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు విధించారా? అనే అంశాన్ని తేల్చాలి.
నిబంధనలను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను కట్టడి చేయడం, కుమ్మక్కు చేయడం వల్ల అధిక ధరలకు పనులు కట్టబెట్టారా? లేదా? దీనివల్ల ఖజానాకు ఎంత నష్టం? అన్నది పరిశీలించాలి.
ఇప్పటివరకు చేసిన పనుల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యతకు,  పరిమాణానికి, బిల్లుల చెల్లింపులకు తేడాలుంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించాలి.
శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

మరిన్ని వార్తలు