ప్రియుడి సాయంతో భర్త దారుణ హత్య

16 Dec, 2018 11:58 IST|Sakshi

 వివాహేతర సంబంధానికి   అడ్డొస్తున్నందుకే..

 తొమ్మిది మంది నిందితుల అరెస్ట్‌

 పరారీలో ఇద్దరు మహిళా నిందితులు

రాజమహేంద్రవరం క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ మహిళ ప్రియుడితో కలిసి పథకం వేసి  హత మార్చింది. ఈ కేసును రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను తూర్పు మండలం డీఎస్పీ యు.రాజారావు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కడియం మండలం, కడియపు సావరానికి చెందిన గుబ్బల వెంకటరమణ (35)ను కొందరు యువకులు ఈ నెల నాలుగో తేదీన హత్య చేశారు. అతడి మృతదేహాన్ని రాజమహేంద్రవరం రూరల్‌ మండలం, పిడింగొయ్యిలోని కాదా దుర్గాప్రసాద్‌కు చెందిన తోట సమీపంలోని తుప్పల్లో ఐదో తేదీన బొమ్మూరు పోలీసులు కనుగొన్నారు.

అసలేం జరిగిందంటే..
 కడియం మండలం, గుబ్బలవారిపాలెంకు చెందిన చీకట్ల సతీష్‌ గ్రామంలోని ఒక నర్సరీలో గుమస్తాగా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ భార్య జ్యోతితో ఏడాదిగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. జ్యోతిని తనతో కలవకుండా కట్టడి చేసిన వెంకటరమణపై కక్ష పెంచుకున్న సతీష్‌ అతడి హత్యకు పథక రచన చేశాడు. ఆ విషయాన్ని జ్యోతికి చెప్పగా ఆమె కూడా సమ్మతించింది. ఇందుకోసం డబ్బు ఎర చూపి సతీష్‌ గతంలో తనకు పరిచయం ఉన్న లావేటి నాగదేవి అనే మహిళ సాయాన్ని తీసుకున్నాడు. 

పథకంలో భాగంగా నాగదేవి కొత్త సిమ్‌ కార్డుతో వెంకటరమణకు ఈ నెల నాలుగో తేదీన ఫోన్‌ చేసింది. ‘నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడాలని ఉంది. నేను కారు పంపిస్తాను. డ్రైవర్‌ నేను ఉన్న చోటుకు నిన్ను తీసుకు వస్తాడు’ అంటూ ఫోన్‌లో వగలు పోయింది. ఆ మాటలు నమ్మిన వెంకటరమణ పిడింగొయ్యి శివార్లలోని నర్సరీ కొబ్బరి తోటలో ఉన్న షెడ్‌ వద్దకు వచ్చాడు. అప్పటికే సతీష్‌ రూ. ఐదు వేలిచ్చి పురమాయించి సిద్ధం చేసిన ఎనిమిది మంది వ్యక్తులూ వెంకటరమణ తలపై బీరు సీసాలు, చైన్లు, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. 

వారందరూ అతడిని కొబ్బరి చెట్టుకు కట్టి ఆ రోజు రాత్రి 12.30 గంటల వరకూ కొడుతూనే ఉన్నారు. అనంతరం సతీష్‌ రేకుల షెడ్‌లో పదునైన కత్తితో వెంకటరమణ గొంతుపై నరికి హత్య చేశాడు. మృతదేహాన్ని తోట బయట ఉన్న తుప్పల్లో దాచి కత్తిని దూరంగా పడేశాడు. దగ్గరలోనే గోతిని తవ్వి శవాన్ని పూడ్చే ఉద్దేశంతో సతీష్‌ మరునాడు అక్కడే తచ్చాడ సాగాడు. తోట యజమాని దుర్గాప్రసాద్‌కు సందేహం వచ్చి సతీష్‌ను నిలదీయగా, అతడు జరిగిన విషయమంతా చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

మరో నలుగురు బాల నేరస్తులు
ఈ కేసులో నిందితులైన చీకట్ల సతీష్, గంటేటి దుర్గాప్రసాద్, కప్పల రవికుమార్, బడుగు రాజేష్, ఖండవల్లి తరుణ్‌ అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారే గాకుండా మరో నలుగురు బాల నేరస్తులను రాజానగరం మండలం, కానవరంలో బొమ్మురు సీఐ కె.నాగమోహన్‌ రెడ్డి అరెస్ట్‌ చేశారు.  హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్‌ ఫోన్లు, రెండు బైక్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజారావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన జ్యోతి, నాగలక్ష్మి పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు