అవినీతి కొండ.. వెంగమాంబ

15 Aug, 2018 11:26 IST|Sakshi
ఎస్కేయూ, అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అదనంగా చెల్లించినట్లు నిర్ధారించిన నివేదిక

అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అదనపు చెల్లింపులు

ఉప కమిటీ సిఫార్సులు పట్టని ఎస్కేయూ యంత్రాంగం

పాలకమండలిలో     నివేదికపై చర్చించకుండా కాలయాపన  

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ     అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవంగా చెల్లించాల్సిన జీతాలు కంటే..     అధికంగా చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద అభిమానం చాటుకుంది. వర్సిటీ ప్రధాన ఖాతా నుంచి నిధులు ఏజెన్సీ నిర్వాహకుడి ఖాతాలో అధికంగా జమ చేసింది. ఈ అవినీతి అక్రమాల వ్యవహారాన్ని ప్రొఫెసర్ల కమిటీ నిర్ధారించింది.   

ఎస్కేయూ: ఎస్కే యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న వెంగమాంబ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అప్పగించిన విధానం, జీతాలు చెల్లింపు, విధివిధానాలు, నియమ నిబంధనలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేయడానికి పాలకమండలి ఉప కమిటీని 2017 మార్చి 8న నియమించారు.  ఈ ఉపకమిటీలో ప్రొఫెసర్‌ బి.ఫణీశ్వరరాజు,  ప్రొఫెసర్‌ ఎ.మల్లికార్జునరెడ్డి, ప్రొఫెసర్‌ జి.శ్రీధర్‌ (మాజీ రెక్టార్‌) సభ్యులుగా ఉన్నారు. 2015 ఆగస్టు 10 నుంచి 2016 డిసెంబర్‌ 31 వరకు వెంగమాంబ ఏజెన్సీకి జమ చేసిన జీత మొత్తాల వివరాలను కమిటీ అధ్యయనం చేసింది. ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలు సరైనవేనా అనే అంశంపై కమిటీ ప్రత్యేకంగా లేబర్‌ డిపార్ట్‌మెంట్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగాలను సందర్శించి మరీ పరిశీలించింది.  సమగ్రంగా అధ్యయనం చేసిన కమిటీ అదే ఏడాది మార్చి 18న నివేదిక సమర్పించింది. ఇందులో ప్రధానంగా అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాల క్లెయిమ్‌ బిల్లులు, కమిటీ సిఫార్సులను పొందుపరిచింది.

బోగస్‌ సంస్థల పేరుతో గోల్‌మాల్‌
ఏదైనా ఏజెన్సీ టెండర్‌ దక్కించుకోవాలంటే కచ్చితంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకోవాలి. కానీ వెంగమాంబ ఏజెన్సీ చట్టబద్ధత లేని సంస్థ అని కమిటీ స్పష్టం చేసింది. ఆరు కొటేషన్లను ప్రధానంగా తీసుకుని అందులో ప్రామాణికతలు గల ఏజెన్సీ సంస్థకు అప్పగించాలి. కానీ ఆరు కొటేషన్లు తిరుపతికి చెందిన ఏ మాత్రం చట్టబద్ధత లేని కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి ఏజెన్సీ దక్కించుకుందని కమిటీ చివాట్లు పెట్టింది. మొదట 40 మంది ఉద్యోగులు అవసరమని టెండర్‌ ఖరారు చేసుకుని.. తర్వాత ఉద్యోగుల సంఖ్యను 69కు పెంచారు. జీతాల చెల్లింపుకు సంబంధించి జీఓ 43, జీఓ 151లను పాటించలేదు. ప్రభుత్వ సంస్థలు, వర్సిటీల్లో అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ జీతాల చెల్లింపునకు ఈ జీఓల ప్రకారం తప్పనిసరిగా విధివిధానాలు పాటించాలి. కేవలం అవగాహన ఒప్పందంలో పొందుపరిచిన అంశాల ప్రకారం జీతాల చెల్లింపు అడ్డుగోలుగా జరిగాయని కమిటీ ఏకరువు పెట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏజెన్సీ నిర్వాహకుడికి భారీగా లబ్ధి చేకూరింది. 

కమిటీ సిఫార్సులే పట్టించుకోలేదు..
‘ఏజెన్సీ నిర్వాహకుడి వ్యవహారం అప్పటికే వివాదాస్పదం కావడంతో కమిటీ నివేదిక ఇచ్చే ముందు ఆరు నెలల జీతాలు చెల్లింపు చేయలేదు. దీంతో ఏజెన్సీకి ఇవ్వాల్సిన రూ.30.54 లక్షలు జీతాలు నిలిపివేయండి. వాస్తవానికి ఏజెన్సీకి అవగాహన ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.75,25,554. కానీ రూ.81,89,278 చెల్లించారు. ఉదారంగా రూ. 6,63,724 అదనంగా చెల్లించారు (కమిటీ నివేదిక ఇచ్చిన కాలం వరకే ). ఇంకా రూ.30.54 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నుంచి అధికంగా చెల్లించిన రూ. 6,63,724 రికవరీ చేయాలి. అనంతరం తక్కిన మొత్తాన్ని ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించండి’ అని కమిటీ స్పష్టం చేసింది. కానీ ఒక్క నయాపైసా రికవరీ చేయలేదు. కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, నివేదిక సమగ్రంగా ఇచ్చినప్పటికీ, ఏకంగా రూ.30,54,000ను ఏజెన్సీ నిర్వాహకుడికి చెల్లించేసి తమ ఉదారతను చాటుకున్నారు.  

నివేదికపై పాలకమండలిలో చర్చేదీ?
‘ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్‌ చందాను ప్రతి నెలా ఏజెన్సీ నిర్వాకుడు జమ చేయలేదు. ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేసిన పీఎఫ్‌ మొత్తం రూ.6,82,201, ఈఎస్‌ఐ చందా కింద ఉద్యోగులకు దక్కాల్సిన మొత్తం రూ.2,70,038. పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తంతో పాటుగా వర్సిటీ అదనంగా చెల్లించిన రూ.6,63,724ను రికవరీ చేయండి. పీఎఫ్, ఈఎస్‌ఐ చందాలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయండి. వర్సిటీకి రావాల్సిన అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన రూ.30.54 లక్షల్లో రికవరీ చేయాల’ని ఉప కమిటీ స్పష్టం చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ నివేదికపై పాలకమండలి సమావేశంలో చర్చించలేదు. నివేదికను తొక్కిపెట్టి మౌనం వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లించాల్సిన మొత్తం రూ.30.54 లక్షలు చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద ఒక క్రిమినల్‌ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. 

మరిన్ని వార్తలు