ముగ్గురూ ముగ్గురే

4 Mar, 2018 10:36 IST|Sakshi

జిల్లాలో ఎవరి దారి వారిదే

పంట ఎండుతున్నా కన్నెత్తిచూడరు

రైతులు రోడ్డెక్కినా పలకరించరు

పరిస్థితిపై అధికారులతోనూ సమీక్షించరు

మండిపడుతున్న అన్నదాతలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు బీజేపికి చెందిన వారు కాగా ఇద్దరు టీడీపీకి చెందిన వారు. బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు తనను అంటరానివారిగా టీడీపీ నాయకులు చూస్తున్నారని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు మంత్రులది వారి పంథా వారిదే. జనం గోడు పట్టించుకోవడం లేదు.

జిల్లాలో సాగునీరు అందక వరిపైరు ఎండిపోతోందని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కనీసం ఆ విషయమై సమీక్ష జరిపే ప్రయత్నం కూడా ఆ ఇద్దరు మంత్రులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటి వరకూ ఆ ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదు. ఇక మరోమంత్రి కేఎస్‌ జవహర్‌ది కూడా ఇదే తీరు.

పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. మార్చి మొదటివారంలోనే పంట పొలాలు బీటలు వారిపోతున్నాయి. వెరసి అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఆరుగాలం శ్రమించే రైతులు ఇప్పుడు రబీ గట్టెక్కేదెలాగా అని మధనపడుతున్నారు. వంతుల వారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్క నీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు.     

జిల్లాలో నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరి డెల్టాలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పచ్చని పంట పొలాలకు నెర్రలు వచ్చాయి.

 పాలకులు ఏం చేస్తున్నట్టు?
సాగునీటి సమస్యపై రైతులు అల్లాడుతున్నా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అండగా నిలవాల్సిన పాలకులు కనీసం స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం జిల్లాలోని ఇరిగేషన్‌ అధికారులను కూర్చోబెట్టి ఏం జరుగుతోంది, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతామన్న ఆలోచన కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మూడు నెలల క్రితం జరిగిన నీటిపారుదల సలహామండలి సమావేశంలో పట్టిసీమ నుంచి నీరు తరలించడం ద్వారా గోదావరి డెల్టా నష్టపోతోందన్న విషయాన్ని మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వెంటనే పట్టిసీమ నుంచి నీటి సరఫరా నిలిపివేయాలని కోరారు.

 అయితే తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. ఒకవైపు గోదావరిలో నీరు అడుగంటినా రికార్డుల కోసం 105 టీఎంసీలను తరలించేశారు. పట్టిసీమ కట్టేసే సమయానికే గోదావరిలో నీటి లభ్యత చాలా తక్కువ ఉందని తేలింది. అయినా డెల్టాను కాపాడే దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత సాగునీటి సంక్షోభం తీవ్రస్థాయిలో ముందుకు వచ్చింది. మంత్రులు కేవలం తమ స్వప్రయోజనాలు, సొంత నియోజకవర్గాలకే పరిమితం అయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు