దొంగాట

15 Oct, 2017 16:33 IST|Sakshi

బోగస్‌ ఓట్లను చేర్పించేందుకు అధికార పార్టీ ఎత్తుగడ

రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు  

కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో బరితెగింపు

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లను చేర్పించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నవంబరు ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దొంగ ఓట్ల నమోదుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందికి అధికార పార్టీ నేతల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల్లో సుమారు పది వేల దొంగ ఓట్లు చేర్పించిన అనుభవంతో కర్నూలు కార్పొరేషన్‌లోనూ అదే తరహా వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న నగరంలోని 33 డివిజన్లలో ఈ ప్రక్రియను భారీగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పక్క నియోజకవర్గాల్లో ఉన్న వారిని ఇక్కడ ఓటర్లుగా చేర్పించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.  

ఒత్తిళ్లు షురూ!.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఈ దొంగ ఓట్ల నమోదునూ ప్రారంభించాలనేది అధికార పార్టీ నేతల ఆలోచనగా ఉంది. ఇటువంటి ఓట్లను అక్కడ నివాసం లేకపోయినప్పటికీ ఓకే చేయాలంటూ రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతల నుంచి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారుల్లో అప్పుడే టెన్షన్‌ మొదలైంది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో పక్కనున్న నియోజకవర్గాల్లోని ఓటర్లను పది వేల మంది వరకూ అధికారపార్టీ నేతలు చేర్పించారు. దీనిపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ అధికారులు సదరు ఓటర్లను గుర్తించారు. అదే తరహాలో కర్నూలులోనూ జరుగుతుందని, ఏమీ భయపడాల్సిన పనిలేదని రెవెన్యూ అధికారులకు అధికార పార్టీ నేతలు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే,  ఉప ఎన్నిక ముందు హడావుడిగా ఓకే చేసిన తరహాలో ఈసారి పరిస్థితి ఉండదని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.     

మరిన్ని వార్తలు