టీడీపీవి ప్రజా వ్యతిరేక విధానాలు

5 Apr, 2016 03:32 IST|Sakshi
టీడీపీవి ప్రజా వ్యతిరేక విధానాలు

కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి

కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని  కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 20న వైజాగ్‌లో ప్రారంభమైన దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీల సామాజిక న్యాయ సాధికారిత యాత్ర సోమవారం సాయంత్రం కర్నూలుకు చేరుకుంది. బళ్లారి చౌరస్తా నుంచి పాతబస్తీ గుండా ఊరేగింపు నిర్వహించి కోట్ల సర్కిల్‌లో డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య అధ్యక్షతన బహిరంగ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ...టీడీపీకి ఓటేసిన పాపానికి ఇంకా మూడేళ్లు ప్రజలు అనుభవించక తప్పదన్నారు. రాజ్యాంగ నిబంధనలతోపాటు  పార్టీ నియమావళికి టీడీపీ అధినేత చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని కౌన్సిల్ అపోజిషన్ లీడర్ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు చెప్పి టీడీపీని డీ-రికగ్నైజ్ చేయాల్సి ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటుమలు కొత్తకాదని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు.  పూదోట లాంటి భారత సమాజాన్ని.. బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చి చెల్లాచెదురు చేశాయని మాజీ మంత్రి జె.డి.శీలం ఆరోపించారు.  రాజ్యాంగం వల్లనే దేశంలో వివిధ మతాలు, భాషలు ఉన్నా ఐకమత్యం సాధ్యమైందని మాజీ మంత్రి కొండ్రు మురళి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు