ఎఫ్‌1హెచ్‌2వో బోట్‌ రేస్‌ విజేత షాన్‌ టొరెంటే

19 Nov, 2018 04:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎఫ్‌1హెచ్‌2వో బోట్‌ రేస్‌లో అబుదాబి టీంకు చెందిన షాన్‌ టొరెంటే విజేతగా నిలిచాడు. ఆదివారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కృష్ణా నదిలో ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టొరెంటే మొదటి స్థానం సాధించగా.. ఎమిరేట్స్‌ టీంకు చెందిన మహిళా డ్రైవర్‌ స్ట్రోమా మారియట్‌ రెండో స్థానంలోనూ, అబుదాబి డ్రైవర్‌ ఎరిక్‌ స్టార్క్‌ మూడో స్థానంలోనూ నిలిచారు. అమరావతి తరఫున బరిలోకి దిగిన డ్రైవర్‌ జోనస్‌ అండర్సన్‌ మొదట్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. బోట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మధ్యలోనే వైదొలిగాడు. అలాగే 44 ల్యాప్‌లు పూర్తి చేయాల్సిన తుది పోరులో అమరావతి టీంకే చెందిన రెండో డ్రైవర్‌ ఎరిక్‌ ఎడిన్‌ 43 ల్యాప్‌లే పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఏడు దశల్లో జరిగే ఈ ఎఫ్‌1హెచ్‌2వో తదుపరి బోట్‌ రేస్‌ దుబాయ్‌లో జరగనుంది. కాగా, ఫార్ములా–4 రేస్‌లో శ్యామ్‌ విఠేల్‌ మొదట స్థానంలోనూ, జెఫ్‌ బెంజిమెన్‌ రెండో స్థానంలోనూ, అహ్మద్‌ అల్‌ ఫాహిమ్‌ మూడో స్థానంలోనూ నిలిచారు. 

ఏటా నిర్వహిస్తాం..
పోటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై ఏటా ఎఫ్‌1హెచ్‌2వో రేస్‌లు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నవంబర్‌ 15, 16, 17 తేదీల్లో ఈ పోటీలు రాష్ట్రంలో జరుగుతాయన్నారు. ఈ రేస్‌ల వల్ల రాష్ట్రం పర్యాటక స్థలంగా గుర్తింపు సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెలలో ఎయిర్‌ఫోర్స్‌ ఈవెంట్‌ జరుగుతుందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు వాటర్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం విజేతలకు సీఎం చంద్రబాబు ట్రోఫీలు అందజేశారు. అలాగే అబుదాబి టీం మేనేజర్‌ కాప్‌ లీ డింగ్, ఎఫ్‌1హెచ్‌2వో ఉపాధ్యక్షుడు లుకిమినా కపిలిసినోని, కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం, పర్యాటక శాఖ అధికారులు ముఖేష్‌ కుమార్‌ మీనా, హిమాన్షు శుక్లాను సీఎం సత్కరించారు. హెచ్‌2వో రేసింగ్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత రాష్ట్రంలోని యువతకు బోట్‌ రేసింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అఖిల ప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు