బళ్లలో టాయిలెట్లేవి ?

20 Aug, 2014 02:31 IST|Sakshi

పాలమూరు : పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం టాయిలెట్లు లేవు. జిల్లాలో 1559 పాఠశాలల్లో ఈ సమస్య ఉంది. అయినా, పాలకులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. జిల్లాలో 2,729 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 580 ప్రాథమికోన్నత పాఠశాలలు, 643 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందుకుగాను పాఠశాలల నిర్వహణకోసం ఏటా రూ. 3.95కోట్లు నిధులు మంజూరు చేస్తోంది. అయినా, వాటి ఫలితాలు ఎక్కడా కనబడడం లేదు. గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1559 పాఠశాలల్లోని విద్యార్థులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 2,948 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రహరీగోడ నిర్మాణాల్లేవు.

దీంతో ఆయా పాఠశాలలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. 794 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంలేదు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 600 అదనపు తరగతి గదులు అవసరం. ఈ సంఖ్య కేవలం విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రమే.. వాస్తవానికి చూస్తే 75 శాతం వరకు పాఠశాలల్లో తగిన మౌలిక వసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా.. అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండటంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు.

కనీస వసతులు లేక కునారిల్లుతున్న పాఠశాలల్లో మరుగుదొడ్లు.. తాగునీటి సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు మూడేళ్ల కిందట ఆదేశించినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. 2009లో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చాక అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్న నిబంధనలున్నాయి. కానీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థినులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు తెలుస్తోంది.
 
సమన్వయలోపం

ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయలోపం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌డబ్యుఎస్ శాఖదేనని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. ఆ శాఖ అధికారులు మేం పాఠశాలల్లో టాయ్‌లెట్లు ఎప్పుడో నిర్మించాం. వాటిని మనుగడలో ఉంచుకోకపోవడానికి బాధ్యులం మేంకాదు. మా లెక్కల ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మింపచేశామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు