నియామకాలకు బ్రేక్‌..!

9 Mar, 2018 11:04 IST|Sakshi
వైవీయూ పరిపాలన భవనం

కోర్టును ఆశ్రయించిన వైవీయూ విద్యార్థులు

స్టే ఇచ్చిన న్యాయస్థానం

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపక నియామకాలకు సంబంధించిన ప్రక్రియకు బ్రేక్‌ పడింది. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్దంగా నియామకాలు చేపడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు, విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పలు విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ఇప్పటికే బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. అదే విధంగా వైవీయూలో నియామక ప్రక్రియ, రోస్టర్‌ విధానంలో తప్పులతడకపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైవీయూకు చెందిన పరిశోధక విద్యార్థులు బి.బాలాజీనాయక్, వి.శ్రీనివాసులు, ఎం. నాగేంద్రనాయక్‌లు కోర్టును ఆశ్రయించారు.

రిట్‌పిటీషన్‌ నంబర్‌ 12500/2018ను కోర్టు స్వీకరించడంతో పాటు ఈ నియామక ప్రక్రియపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టే ఇస్తూ గురువారం తీర్పునిచ్చింది. రోస్టర్‌ విధానం, జీఓనం.117, ఎస్టీ రిజర్వేషన్‌లో నిబంధనలు పాటించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్టే ఇవ్వడం గమనార్హం. దీంతో వైవీయూలో 2017 అక్టోబర్‌ 18న విడుదల చేసిన బ్యాక్‌లాగ్‌ నోటిఫికేషన్‌తో పాటు 2018 జనవరి 3,4 తేదీల్లో వేర్వేరుగా ఇచ్చిన జనరల్‌ నోటిఫికేషన్‌లు సైతం నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు విశ్వవిద్యాలయానికి చేరుకోగా వాటిని స్క్రూటినీ చేసే పనిలో అధికారులు ఉండగానే.. నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకోవడం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా..
యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగినవి. ఈ నిబంధనల ప్రకారం ఒక విభాగం ఏర్పాటు కావాలంటే అందులో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలన్న నిబంధన ఉంది. అదే విధంగా 12బీ, 2ఎఫ్‌ కలిగిన విద్యాలయాలకు యూజీసీ గ్రాంట్స్, ఇతరత్రా నిధులు లభిస్తాయి. ఇందులో ఏవైనా కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలన్నా, నూతన పోస్టులు మంజూరు చేయాలన్నా విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 390 జీఓను జారీ చేసి హైపవర్‌ కమిటీ పేరుతో రేషనలైజేషన్‌ ప్రక్రియ, పోస్టులను కన్వర్ట్‌ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా కొన్ని కోర్సులు కనుమరుగు కావడంతో పాటు పోస్టులు కూడా గల్లంతు అయ్యే పరిస్థితి తలెత్తింది. మరికొన్ని చోట్ల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులుగా తలకిందులయ్యాయి. దీంతో కేవలం ఒక్క వైవీయూలోనే 43 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు వాటిని 18 పోస్టులకు కుదించారు.

ఈ 18 పోస్టుల్లో సైతం మళ్లీ 12 పోస్టులను బ్యాక్‌లాగ్‌ కింద కేటాయించారు. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నప్పటికీ 5 విభాగాలను హేతుబద్దీకరణ పేరుతో మూసివేతకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ 2017 జనవరిలో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైవీయూ నుంచి ఫిజిక్స్‌ అధ్యాపకుడు వై.పి. వెంకటసుబ్బయ్య కోర్టును ఆశ్రయించడంతో దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు వెలువరిచింది. దీంతో ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా నియామకాలు చేపట్టేందుకు వేర్వేరు జీఓలను విడుదల చేసింది. దీంతో ఒక్కో విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు జారీచేశాయి. నియామక ప్రక్రియకు సంబంధించి వైవీయూకు 2017 జూన్‌ 30వ తేదీన జీ.ఓ ఎంఎస్‌ నెం.28ను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌లో వైవీయూ జెనిటిక్స్‌ అండ్‌ జీనోమిక్స్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ నియామక ప్రక్రియ కోసం జారీ అయిన జీఓనెం. 28పై స్టే విధించింది. దీనిపై ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించగా నియామక ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పరిశోధక విద్యార్థులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కడంతో నియామక ప్రక్రియకు మరోసారి బ్రేక్‌ పడినట్లయింది.

మరిన్ని వార్తలు