ఒకటే ముఖం.. ఓట్లు అనేకం

16 Nov, 2018 12:23 IST|Sakshi
దేశపోగు మాధవి పోటోతో వేర్వేరు ఐడీ నంబర్లలో మూడు ఓట్లు ఉన్నట్లు స్పష్టం చేస్తున్న ఓటర్ల జాబితా

జిల్లాలో కుప్పలు తెప్పలుగా బోగస్‌ ఓటర్లు

వీరిని గుర్తించడంలో సాఫ్ట్‌వేర్‌ విఫలం

అడ్డదారుల్లో విజయం సాధించేందుకు టీడీపీ కుట్ర

కర్నూలు(అగ్రికల్చర్‌): అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం..నాలుగున్నర సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలేకపోయింది. తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకొని.. వచ్చే ఎన్నికల్లో అడ్డదారుల్లో విజయాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు బోగస్‌ ఓట్లను చేర్పిస్తున్నారు. సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు జిల్లాలో 2,17,474 బోగస్‌ ఓటర్లు ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగిన కొందరు అధికారులు అక్రమాలకు సహకారం అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  

టీడీపీ ‘బోగస్‌’ సృష్టి: బోగస్‌ ఓటర్ల నమోదులో అధికార పార్టీ లీలలు అన్నీ ఇన్నీ కావు. ముఖం ఒక్కటే ఉన్నా..ఓట్లు మాత్రం మూడు, నాలుగు ఉంటున్నాయి. ఈ పరిస్థితి కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, పత్తికొండ, పాణ్యం, మంత్రాలయం తదితరనియోజక వర్గాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బోగస్‌ ఓట్లలో అనేక రకాలు ఉన్నాయి. ఒకే ఓటరు ఐడీపై ఒక వ్యక్తికి వేర్వేరు చోట్ల రెండు నుంచి మూడు వరకు ఓటర్లుగా ఉండటం, ఓటరు పేరు, తండ్రిపేరు మాత్రం మార్చి మిగిలిన వివరాలన్నీ ఒకేలా ఉంచి దొంగ ఓట్లు సృష్టించడం... ఇలా అనేక రకాలుగా బోగస్‌ ఓటర్లను అధికార పార్టీ సృష్టిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని గుట్టు చప్పుడు కాకుండా అర్బన్‌ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకే ముఖంతో వేరువేరు ఐడీ నంబర్లతో రెండు నుంచి మూడు వరకు ఓట్లు కలిగిన వారు జిల్లాలో వేలాదిగా ఉన్నారు. సెప్టంబరు 1 నుంచి అక్టోబరు 31 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 1.50లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సగానికిపైగా దరఖాస్తులను అధికార పార్టీ నేతలు పార్టీ కార్యాలయాల నుంచి అన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసినవే ఉన్నాయి. ఇందులో అత్యధికం బోగస్‌ ఓటర్లేనన్న విమర్శలు ఉన్నాయి. ఒకే వ్యక్తి ఫొటోతో వేరువేరు నియోజకవర్గాలు, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లుగా నమోదు చేయించేందుకు దరఖాస్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. దరఖాస్తులను విచారించకుండా ఆమోదిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

జిల్లాలో 62,757 మంది డూప్లికేట్‌ ఓటర్లు
జిల్లాలో ఉన్న ఓటర్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా డూప్లికేట్, మల్టిపుల్‌ ఓటర్లు 62,757 మందిని గుర్తించారు. వీరిపై బీఎల్‌ఓలు ఈ ఏడాది జూన్‌లో ఇంటింటికీ వెళ్లి వెరిఫై చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్న సమాచారం. ఇందులో 4,784 ఓటర్లు మాత్రమే డూప్లికేట్‌ ఓటర్లుగా గుర్తించి తొలగించారు. డూప్లికేట్‌ ఓట్లన్నీ అధికార పార్టీకి చెందినవి కావడంతో తూతూమంత్రంగా విచారణ జరిపినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డూప్లికేట్‌ ఓటర్లలో ఒకే ముఖంతో వేరువేరు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉన్న వారే అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

18 ఏళ్లు పైబడి వారి జనాభా 25,97,593.... జిల్లాలో ఉన్న ఓటర్లు 27,57,094
జనాభాతో ఓటర్లను పోలిస్తే జిల్లాలో బోగస్‌ ఏ స్థాయిలో ఉన్నారో స్పష్టమవుతుంది. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం జిల్లాలో 18 ఏళ్లపైబడిన వారి జనాభా 25,97,593 ఉంది. 18 ఏళ్లు నిండిన వారే ఓటర్లుగా నమోదవుతారు. ఓటర్ల కూడా కొంత అటూ, ఇటూగా ఈ ప్రకారమే ఉండాలి. అయితే సెప్టంబరు1న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 27,57,094 మంది ఓటర్లు ఉన్నారు. జనాభతో పోలిస్తే ఓటర్లు 1,59,501 మంది ఎక్కువ( ఎక్సెస్‌)గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీరందరూ డూప్లికేట్‌ ఓటర్లేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  

ఒకే మహిళకు రెండు ఓట్లు...  
కర్నూలుకు చెందిన దేశపోగు మాధవి అనే మహిళకు ఏకంగా మూడు ఓట్లు ఉన్నాయి. ఒకే పోలింగ్‌ కేంద్రంలో వేరువేరు ఐడీ నంబర్లతో మూడు ఓట్లు ఉండటం గమానార్హం. ఒకే ఐడీ నంబరుతో ఉంటే పొరపాటున రిపీట్‌ అయినట్లు భావించవచ్చు. కాని వేరువేరు ఐడీ నంబర్లతో మూడు ఒకే మహిళ, ఒకే ఫొటోతో మూడు ఓట్లు కలిగి ఉండటం అధికార పార్టీ బోగస్‌ ఓట్లకు పరాకాష్టగా చెప్పవచ్చు. కర్నూలు నగరంలోని 115వ పోలింగ్‌ బూత్‌లో దేశపోగు మాధవికి ఎఊ2748168 ఐడీ నంబర్, సీరియల్‌ నంబర్‌ 995తో ఓటరు జాబితాలో పేరు ఉంది. ఇదే మహిళకు ఇదే పోలింగ్‌ కేంద్రంలో ఎఊ2739944 ఐడీతో, సీరియల్‌ నంబర్‌ 997తో ఓటు కల్పించారు. జడ్‌జీఎఫ్‌ 2739936 ఐడీ నెంబరులో 996 సీరియల్‌ నెంబరుతో ఓట్లు కల్పించారు. ఇటువంటివి ఈ పోలింగ్‌ కేంద్రంలో 10 వరకు ఉన్నాయి.  

ఫొటో ఒకటే.. వివరాలు వేరు  
కర్నూలు నగరంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఒకే వ్యక్తి ఫొటోతో వేర్వేరు పేర్లు, వివరాలతో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరుగా ఉన్నారు. 115వ పోలింగ్‌ కేంద్రంలో ఆదిశేషన్న అనే వ్యక్తి ఎఊ 2249432 ఐడీ నంబర్‌తో, సీరియల్‌ నంబర్‌ 666తో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇదే వ్యక్తి 116వ పోలింగ్‌ కేంద్రంలో ఎఊ2249028 ఐడీ నంబర్‌తో, సీరియల్‌ నంబర్‌ 320తో ఓటరుగా ఉండటం గమనార్హం. ఇటువంటి ఓటర్లు కర్నూలులో కుప్పలు తెప్పలుగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు