క్యాంపస్‌ ఉద్యోగాల పేరిట పని చేయించుకొని..

17 Jul, 2019 09:19 IST|Sakshi
సంస్థ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ప్రో ‘సాఫ్ట్‌’ సొల్యూషన్స్‌ పేరుతో దోపిడీ

బోర్డు తిప్పేసిన సంస్థ.. యజమాని పరారీ

నిరసనకు దిగిన ఉద్యోగులు 

సాక్షి, ఆటోనగర్‌(విజయవాడ): అందరూ గ్రామీణ ప్రాంత వాసులే. సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్నారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఎంపికయ్యారు. విద్యార్థులు ఎగిరి గంతేశారు. ఎంతో సంతోషంతో ఉద్యోగం చెరిపోయారు. ఉద్యోగం వచ్చిన సంతోషంలో సంస్థ యాజమాన్యం అడగ్గానే రూ.5 వేలు చెల్లించారు. నెలన్నరకే సంస్థ ఎత్తేశారు. ఈ ఘటన ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. 

వివరాలు.. జవహర్‌ ఆటోనగర్‌ ఇండస్ట్రీయల్‌ మూడో రోడ్డులో ప్రో సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ పేరుతో సంస్థను నడుపుతున్నారు. తిరువూరులోని శ్రీవాణి ఇనిస్టూట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌టెక్నాలజి వీరందరికి మార్చి 25న ఈ సంస్థ సభ్యులు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో నైపుణ్యత ఉన్నవారిని కొందరిని ఎంపిక చేసుకున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తరువాత వీరందరూ ఎంపిక అయినట్లు కాల్‌ లేటర్లు  ఇచ్చారు. దీంతో జూన్‌ 1 నుంచి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ విధంగా జూన్‌ 1 నుంచి ఈ నెల 15 వరకు పని చేయించుకున్నారు. గత నెల జీతం ఇవ్వమని ఆ సంస్థను అడిగితే అదిగో ఇస్తాం... ఇదిగో ఇస్తాం... అంటూ తీరా ఇప్పుడు సంస్థను మూసేస్తున్నామని చెప్పినట్లు ఇంజినీరింగ్‌ విద్యార్థులు వాపోతున్నారు.

నెలన్నర నుంచి హాస్టల్‌లో..
నెలన్నర నుంచి హాస్టల్‌లో ఉంటూ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పటికి హాస్టల్‌కు గాను రూ.10,000 ఖర్చు చేశారు. ఈ సంస్థలో కంప్యూటర్‌లు లేవు. వీరి వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌ద్వారానే ప్రాజెక్ట్‌ వర్కు చేసినట్లు వాపోతున్నారు. మేము చెల్లించిన రూ.5 వేలు ఇవ్వాలని సంస్థను కోరామని, అయితే అందుకు సంస్థ నిరాకరించినట్లు బాధితులు లక్ష్మీతిరుపతమ్మ, లక్ష్మి చెప్పారు. వీరంతా జగ్గయ్యపేట, గంపలగూడెం, తిరువూరు నుంచి వచ్చిన వారే అధికం. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధికి ‘సాక్షి’ ఫోన్‌ చేయగా ఆయన తల్లి లిఫ్ట్‌ చేసి మా అబ్బాయిపై రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని సమాధానం చెప్పారు.

మరిన్ని వార్తలు