కనిపించని కేజీహెచ్‌ నీడ

4 Mar, 2019 06:45 IST|Sakshi
ఇది ఒరిజినలేనా?

సాక్షి కథనంతో పెద్దాసుపత్రిలో కలకలం

విశాఖ సిటీ: ఈ మధ్యన వచ్చిన నెపోలియన్‌ సినిమాలో హీరో నా నీడపోయింది సార్‌ అంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తాడు. సరిగా ఇదే తరహాలో కేజీహెచ్‌ సిబ్బంది ఆస్పత్రిలో ఈ రోజు ‘షాడో’ కనిపించలేదుగా అంటూ గుసగుసలాడుకున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఆస్పత్రిని, సూపరింటెండెంట్‌ని అంటిపెట్టుకుని ఉండే సదరు ‘ఖాన్‌’ట్రాక్టు ఉద్యోగి ఆదివారం ప్రచురితమైన సాక్షి కథనంతో కేజీహెచ్‌ ఛాయల్లోకి రాలేదు.

ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి వచ్చినసూపరింటెండెంట్‌..
ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్‌పై పెత్తనం చెలాయిస్తున్న అనధికారి ఖాన్‌ వ్యవహార శైలిపై సాక్షి దినపత్రికలో ‘కేజీహెచ్‌కు నీడ.. పీడ’ శీర్షికన ప్రచురితమైన కథనంతో కింగ్‌జార్జి ఆస్పత్రిలో కలకలం రేగింది. ప్రతిరోజూ సిబ్బంది, వైద్యాధికారులపై పెత్తనం చెలాయించే సదరు సూపరింటెండెంట్‌ షాడో ఆదివారం మాత్రం కానరాలేదు. ఈ రోజు ప్రశాంతంగా పని చెయ్యగలుగుతున్నామని పలువురు వైద్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. మరోవైపు ఏదైనా అత్యవసర సేవలు, ముఖ్య కార్యక్రమాలైతే తప్ప ఆదివారం ఆస్పత్రికి రాని సూపరింటెండెంట్‌ ఆదివారం ఉదయం 9 గంటలకే కేజీహెచ్‌కు వచ్చేశారు. ఇది ఆస్పత్రిలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘ఖాన్‌’ట్రాక్టు ఉద్యోగిగా ఐడీ కార్డు హల్‌చల్‌
ఇదంతా ఒకెత్తయితే ఇన్నాళ్లూ అనధికారికంగానే ఆస్పత్రిలో చలామణి అయిన షాడో ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. కానీ సాక్షి కథనం ప్రచురితమైన తర్వాత ఆయన కేజీహెచ్‌లోని ఓ విభాగంలో  ‘ఖాన్‌’ట్రాక్ట్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఐడీ కార్డు హల్‌చల్‌ చేసింది. ఇది నిజమైనదా ఉన్నఫలంగా తయారు చేసిందా అనే విషయంపై మాత్రం కేజీహెచ్‌ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. అయితే శానిటేషన్‌ ఏజెన్సీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి సూపరింటెండెంట్‌ కారులో తిరుగుతూ ఆయన చాంబర్‌ చుట్టు పక్కలా కనిపించే పని ఏముంటుందని కేజీహెచ్‌ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఏ1 కాంట్రాక్టు ఉద్యోగే
ఎ.ఖాన్‌ అనే వ్యక్తి ఎ1 ఔట్‌సోర్సింగ్‌ శానిటేషన్‌ ఏజెన్సీలో వర్క్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున ఓ ప్రకటనలో తెలిపారు. కేజీహెచ్‌లో జరిగే వివిధ పనులకు సంబంధించిన పర్యవేక్షణ చూస్తారని పేర్కొన్నారు. పరిపాలన పరమైన విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఖాన్‌పై ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన కథనంపై విచారణ చేపట్టి సదరు వ్యక్తిపైనా, సంస్థపైనా చర్యలు తీసుకుంటామన్నారు.  

మరిన్ని వార్తలు