విజయవాడలో నకిలీ బీమా పత్రాలు

1 Mar, 2014 01:44 IST|Sakshi

విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : నగరంలో భారీగా నకిలీ బీమా పత్రాలు చలామణిలో ఉన్నాయి. కొందరు ఏజెంట్లు వాహన యజమానులను బురిడీ కొట్టించి నకిలీ బీమా పత్రాలు అంటగడుతున్నారు. వాహనం చోరీకి గురైన, రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భాల్లో వీరి బాగోతం వెలుగులోకి వస్తున్నా..ఏదో విధంగా ‘మేనేజ్’ చేసుకొని బయటపడుతున్నారు. యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

రవాణాశాఖ అధికారుల ఉదాసీనత..వాహన యజమానుల అమాయకత్వాన్ని వీరు సొమ్ము చేసుకుంటున్నారు.  ప్రైవేటు బ్యాంకుల బీమా విభాగంలో పనిచేసి మానేసిన వారే ఎక్కువగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దికాలం కిందట నగరంలోని ఓ వ్యక్తి వాహనం చోరీకి గురైంది.
 
వాహనం ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో..పోలీసుల సలహా మేరకు ఓ ప్రైవేటు బీమా కంపెనీ అధికారులను కలిసి సమస్య వివరించారు. తన వాహనం బీమా కాలపరిమితి తీరలేదని చెప్పిన మీదట..అక్కడి అధికారులు పరిశీలించి ఆ బీమా పత్రం తమ కంపెనీది కాదని తేల్చారు. తమ కంపెనీ పేరిట ఎవరో నకిలీది తయారు చేసి ఇచ్చి ఉండొచ్చని చెప్పడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో కూపీ లాగిన పోలీసులు.. పెద్ద మొత్తంలో నకిలీ బీమా పత్రాలు నగరంలో చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

గతంలో ఓ ప్రైవేటు బ్యాంకు బీమా విభాగంలో పనిచేసిన ఆ వ్యక్తి ఇంట్లోని కంప్యూటర్‌తో ఈ నకిలీ బీమా పత్రాలు తయారు చేస్తున్నాడు. తనకున్న పరిచయాలను ఆసరాగా చేసుకొని బీమా ఏజెంట్ అవతారమెత్తి..ఈ నకిలీలను వాహన చోదకులకు అంటగడుతున్నాడు. వాటిపై గతంలో తాను పని చేసిన ప్రైవేటు బ్యాంకు ముద్ర కూడా వేసి ఇవ్వడంతో..యజమానులు అనుమానించడం లేదు. తీరా మోసపోయిన తర్వాత లబోదిబోమనడం యజమానుల వంతైంది.

ఈ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా నగరంలోని నకిలీ పత్రాల మోసగాళ్లను గుర్తించే ప్రయత్నం చేపట్టారు. ఏజెంట్ల తీసుకొచ్చే వాహనాల కాగితాలపై రవాణా అధికారులు తగిన విచారణ చేయకుండానే లెసైన్స్‌లు నవీకరించడం.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం వల్లే ఇలాంటి కేటుగాళ్లు చెలరేగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

 కట్టడి ఇలా
 వాహనాల ఫిట్‌నెస్ చూసేటప్పుడు రవాణాశాఖ అధికారులు బీమా పత్రాలు అసలువా? నకిలీవా? సరిపోల్చుకోవాలి.
 
 లెసైన్స్‌లు రెన్యువల్ సమయంలోను కూడా తగిన విధంగా బీమా పత్రాలపై విచారణ జరపాలి.
 
 ఎక్కువగా ఏజెంట్లు తీసుకొచ్చే వాహనాల విషయంలోనే నకిలీలు ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీటిపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
 
 బీమా ప్రయోజనాలు
 రోడ్డు ప్రమాదంలో వ్యక్తులు మరణిస్తే వాహనంపై చేసిన బీమా ఆధారంగా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు వస్తుంది. దీంతో వాహన యజమాని నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
 
 ఒకవేళ రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు.. దెబ్బతిన్న దానికి డామేజీ బీమా ఇస్తారు.
 
 వాహనాలు చోరీకి గురైతే బీమా కంపెనీల నుంచి తగిన పరిహారం యజమానికి అందుతుంది.
 
 నకిలీలతో నష్టాలు
 రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తులు మరణించినప్పుడు థర్డ్ పార్టీ బీమా ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించవు. దీంతో ప్రమాదంలో వ్యక్తులను కోల్పోయిన వారు నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉండదు.
 
 డామేజీ వాహనాలకు పైసా కూడా రాదు.


 వాహనం చోరీకి గురైతే ఇక అంతే సంగతులు. పరిహారం రాక వాహన యజమాని ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
 

మరిన్ని వార్తలు