నకిలీ.. మందుల మకిలి!

8 Nov, 2017 08:31 IST|Sakshi

నకిలీ మందుల గుట్టురట్టు

నంద్యాల, గుంటూరు కేంద్రంగా దందా

బ్రాండెడ్‌ పేరుతో విక్రయాలు

ఢిల్లీ నుంచి దిగుమతి

అన్నదమ్ములే కీలక సూత్రధారులు

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని మందుల(ఔషదం) దుకాణాల్లో నకిలీ మందులు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. బ్రాండెడ్‌ మందులపై ప్రజలకున్న నమ్మకాన్ని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్‌  కంపెనీల మందులను పోలి ఉండేలా తయారు చేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్నారు.   

నకిలీ గుట్టు ఇలా వెలుగులోకి...
జాన్సన్‌ కంపెనీ తమ ఉత్పత్తి అల్ట్రాసెట్‌ అనే మాత్రల అమ్మకాలు కొన్ని నెలల నుంచి తగ్గినట్లు గుర్తించింది. అయితే వారి పరిశోధనలో తమ ఉత్పత్తులను పోలి ఉండే నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కాపీరైట్‌ యాక్ట్‌ కింద విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గత నెల 28న ఫిర్యాదు చేశారు. విచారణలో  నంద్యాలకు చెందిన  అన్నదమ్ములు గూడూరు పృథ్వీతేజ, గూడూరు చరణ్‌తేజ దందా చేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు అధికారులు ఈ నెల 2న నంద్యాలకు వచ్చి చరణ్‌తేజ్‌ను అదుపులో తీసుకుని ప్రశ్నించారు.  ఢిల్లీలోని ప్రేమ్‌జీ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వహిస్తున్న రామాషిష్‌శర్మ నుంచి నకిలీ మందులు కొనుగోలు చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇప్పటిదాకా విజయవాడలో దుర్గా ఏజెన్సీ ద్వారా అధికారులు రూ.60 లక్షల విలువ జేసే నకిలీ అల్ట్రాసెట్‌ మాత్రలను విక్రయించినట్లు తెలుసుకున్నారు.  అల్ట్రాసెట్‌ మాత్రమే గాకుండా మరో ఏడు రకాల బ్రాండెడ్‌ మందులు మార్కెట్‌ చేసినట్లు తేలింది.  

వాటితో భారీ లాభాలు...
సాధారణంగా బ్రాండెడ్‌ కంపెనీల మందులపై రిటైలర్లకు తక్కువ లాభాలు వస్తాయి. నకిలీ మందులు విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయి. ఈ విషయం తెలిసి జిల్లాలోని పలువురు డీలర్లు, ఏజెన్సీలు, రిటైలర్లు నకిలీ మందుల విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తే అధిక మొత్తంలో నకిలీ మందులు బయటపడే అవకాశం ఉంది.

నకిలీ మందులు స్వాధీనం చేసుకుంటున్నాం
జిల్లాలో 8 రకాల బ్రాండెడ్‌ కంపెనీలను పోలి ఉండే నకిలీ మందులను గుర్తించాం. మొత్తం 12 దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. నకిలీ మందులు విక్రయించే వారిపై డ్రగ్స్‌అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తాం.  నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల నుంచి జీవితఖైదు, రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నకిలీ మందులకు సంబంధించి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా ఎస్‌.విజయకుమార్‌ నియమితులయ్యారు. – చంద్రశేఖరరావు, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌

నకిలీ మాత్రల్లో ఔషధమే లేదు
అల్ట్రాసెట్‌ మాత్రలను నొప్పుల నివారణకు వాడతారు. ఇందులో  పారాసిటమాల్‌ 325 ఎంజీ, ట్రమడాల్‌ 37.5 ఎంజీ ఉండాలి. కానీ నకిలీ మాత్రల్లో ట్రమడాల్‌ మందు లేనేలేదు. పారాసిటమాల్‌ కూడా 200 ఎంజీ ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పాంటాసిడ్‌లో కూడా ప్యాంటాప్రొజోల్‌ మందు అసలే లేదు. కేవలం సుద్దముక్కను మాత్రలుగా తయారు చేసి మార్కెట్‌లోకి వదిలేశారు. జిల్లాలోని పలు మందుల దుకాణాల్లో ప్రస్తుతం అల్ట్రాసెట్‌(జాన్సన్‌ కంపెనీ)తో పాటు పాంటాసిడ్‌ డీఎస్‌ఆర్, పాంటాసిడ్‌ 40, పాంటాసిడ్, కౌమోరల్‌ ఫోర్ట్, షెల్‌కాల్‌ 500, స్కిన్‌లైట్, యుడిలివ్‌ 300 మాత్రలు చెలామణిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  

మరిన్ని వార్తలు