ఎంపీ అభ్యర్థి అనురాధపై దుష్ప్రచారం

9 Apr, 2019 09:02 IST|Sakshi
రిటర్నింగ్‌ అధికారి, జేసీ మల్లికార్జునకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

సాక్షి,  అమలాపురం టౌన్‌: అమలాపురం ఎంపీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చింతా అనురాధ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రత్యర్థుల కంటే ప్రచారంలో దూసుకు పోతుంటే.. ఆమె కార్యాలయాలకు తాళాలు వేశారని...చేతులెత్తేశారని సాగుతోన్న అసత్య ప్రచారాన్ని పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పెయిడ్‌ ప్రసారాలు, యాడ్‌ల కోసం పాకులాడే రెండు టీవీ ఛానళ్లల్లో వచ్చిన తప్పుడు ప్రసారాలను ఆ పార్టీ కార్యకర్తలు తిప్పుకొడుతున్నారు.

తప్పుడు ప్రచారాలు చేస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ ఆర్‌ఓ, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనురాధ బంధువు, న్యాయవాది తాళ్ల సాంబమూర్తి, పార్టీ నాయకులు జిన్నూరి బాబి, పీకే రావు తదితరులు ఆయన ఫిర్యాదు అందజేశారు. అభ్యర్థి గెలుపును దెబ్బ తీసేందుకు ఫేక్‌ న్యూస్‌ ప్రసారం చేసిన 99 టీవీపైనా... ఆ టీవీ విలేకరిపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై విచారణ చేయిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రసారం చేసిన 99 టీవీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

 అది ఫేక్‌ న్యూసే : అనురాధ  
తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను లోక్‌సభ అభ్యర్థి అనురాధ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రసారం ఫేక్‌న్యూస్‌గా కొట్టిపారేశారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళిత మహిళ తనపై నమ్మకం ఉంచి ఎంపీ టికెట్‌ ఇచ్చారన్నారు. ఆయన నమ్మకానికి అనుగుణంగానే రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేసుకుంటున్నట్టు చెప్పారు. తప్పుడు ప్రచారం, ఫేక్‌న్యూస్‌ వల్ల మొత్తం నియోజకవర్గంలోని ప్రజల దృష్టి అంతా తనపై పడిందని, ఇప్పుడు అందరూ వాస్తవాలు తెలుసుకోవడంతో తనకు మంచే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు