ఏటీఎం కేంద్రంలో చెల్లని నోట్లు

26 Jun, 2018 13:33 IST|Sakshi
చెల్లని నోట్లు వచ్చిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఏటీఎం, ఏటీఎంలో వచ్చిన చెల్లని నోట్లు

కంగుతిన్న ఖాతాదారులు

నర్సీపట్నం: ఏటీఏం కేంద్రాల్లో చెల్లని నోట్లు వస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా బ్యాంకు సిబ్బందికి తెలిసే జరుగుతుందని ఖాతాదారులు ఆరోపిస్తుండగా, దీనికి ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టే ఏజెన్సీ నిర్వాహకులే బాధ్యులని బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు. సోమవారం పట్టణంలోని చింతపల్లి రోడ్డులో ఉన్న సెంట్రల్‌ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.ఉదయం 11 గంటల నుంచి డ్రా చేసిన వారందరికీ కాలిపోయిన, ఇంకు మచ్చలతో చిరిగిన రూ.2 వేల నోట్లు వచ్చాయి. డ్రా చేసిన వారందరికీ ఈ సమస్య ఎదురైంది.

పట్టణంలో శివపురానికి చెందిన నందకిషోర్‌ తన భార్య నాగేశ్వరి ఏటీఎం కార్డు నుంచి రూ.10 వేలు డ్రా చేశారు. వీటిలో ఐదు రెండు వేల నోట్లలో నాలుగు నోట్లు చిరిగిన, ఇంకు మచ్చల నోట్లు ఉన్నాయి. పెళ్లి ఖర్చుల నిమిత్తం డబ్బులు డ్రాచే సేందుకు నర్సీపట్నం మండలం మొండిఖండి నుంచి వచ్చిన రామలక్ష్మికి ఇదే సమస్య ఎదురైంది. రూ.20 వేలు డ్రాచేస్తే రెండు రెండు వేల నోట్లు చెల్లనివి ఉన్నాయి. వీరికన్నా ముందు రూ.40 వేలు డ్రా చేసిన ఖాతాదారునికి మొత్తం చెల్లని నోట్లు రావడంతో కంగుతిన్నాడు. వీరంతా ఆందోళనకు గురవడంతో ఏటీఏం కేంద్రం సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు కిలోమీటరు దూరంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ బ్రాంచికి వెళ్లారు. బ్యాంకు మేనేజర్‌ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహించారు. ఒక దశలో బ్యాంకుకు సంబంధం లేదని చెప్పిన మేనేజర్‌ మోహన్‌రాజ్‌ బాధితుల సంఖ్య పెరగడంతో మెట్టు దిగారు. ఏటీఏం కేంద్రంలో నగదు పరిశీలించారు. డ్రా చేసిన రశీదు ఆధారంగా నగదు చెల్లించారు.

ఎందుకిలా...
ఏటీఎం కేంద్రాల్లో చెల్లని నోట్లు రావడం వెనుక పెద్ద రాకెట్‌ ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఏటీఎం కేంద్రాల్లో సంబంధిత బ్యాంకు అధికారులు లేదా ఏజెన్సీ నిర్వాహకులు నగదు ఏర్పాటు చేస్తారు. బ్యాంకు అధికారుల విషయానికొస్తే రిజర్వ్‌బ్యాంకు సూచనలకు అనుగుణంగా ఉన్న నోట్లను మాత్రమే కౌంటర్లలో ఖాతాదారులనుంచి తీసుకుంటారు. అందువల్ల ఏటీఎం కేంద్రాల్లో చెల్లని నోట్లు రావడం వెనుక కరెన్సీ ఏజెన్సీ ప్రమేయం ఉందన్న విమర్శలున్నాయి. నర్సీపట్నంలోని సెంట్రల్‌ బ్యాంకు ఏటీఏం కేంద్రంలో డైవోల్డ్‌ ప్రైవేట్‌ ఏజెన్సీ నగదు ఏర్పాటు చేసింది. చెల్లని  నోట్లు రావడంతో బ్యాంకు మేనేజర్‌ ఏజెన్సీ ప్రతినిధిని రప్పించి ప్రశ్నించారు. తాము ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెచ్చిన నగదును ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం ఉందనే దానిపై బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఖాతాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు