వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ పోలీసు

2 Jan, 2019 08:26 IST|Sakshi

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద సోమవారం సాయంత్రం స్థానిక పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం వేలంగి గ్రామానికి చెందిన సివేరి రాము అలియాస్‌ వెలుగుల వెంకటరమణ అనే నకిలీ పోలీసు పట్టుబడ్డాడు. తహసీల్దార్‌ ఎం.అరుణకుమారి సమక్షంలో నిందితుడి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి సాకె జ్యోతి నిందితునికి 14 రోజుల రిమాండ్‌ విధించినటుట ఎస్‌ఐ ఎస్‌.అమ్మినాయుడు తెలిపారు. పట్టుబడ్డ నకిలీ పోలీసును విచారించగా పలువు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గత నెల డిసెంబరు మూడునే జైలు నుంచి బయటకు వచ్చాడు. అదే నెల 9న రంపచోడవరం సమీపంలో రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంలో వేచి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి తాను కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకుని నకిలీ ఐడెంటిటీ కార్డును చూపి అతని నుంచి బైక్‌ తీసుకుని ఉడాయించాడు. 

ఇటీవల ఎస్‌.కోట గ్రామంలో 220 సీసీ పల్సర్‌ మోటారుసైకిల్‌తో వేచి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి కానిస్టేబుల్‌ అని పరిచయం చేసుకొని దొంగిలించిన బైక్‌ను వదిలేసి అక్కడ నుంచి కొత్త బైక్‌ను తీసుకుని పరారయ్యాడు. అలా వెళ్తూనే మార్గమధ్యలో ఓ కళాశాల విద్యార్థి నుంచి సామ్‌సంగ్‌ సెల్‌ఫోన్‌ను దొంగలించుకుపోయినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడ, బెంగళూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, బిలాస్‌పూర్, ఖమ్మం పోలీసుస్టేషన్ల పరిధిలో పలు గంజాయి కేసుల్లో నేరం చేసినట్టు...పలువురి నుంచి మోటారుసైకిళ్లు, సెల్‌ఫోన్లు, పర్సులు దొంగిలించినట్టు శిక్షలు కూడా అనుభవించినట్టు నిందితుడు సివేరి రాము పోలీసుల విచారణలో వివరించాడు. నిందితుడి నుంచి 220 సీసీ పల్సర్‌బైక్, సామ్‌సంగ్‌ సెల్‌ఫోన్, నాలుగు కిలోల గంజాయిని ఎస్‌ఐ అమ్మినాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌.కోట సీఐ బి.వెంకటరావు నిందితుడు రామును అరెస్టు చేసి స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టు హాజరుపరచగా న్యాయమూర్తి జ్యోతి 14 రోజులు రిమాండ్‌ విధించినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు