రైతు మెడపై నకిలీ కత్తి

12 Jun, 2017 17:31 IST|Sakshi
రైతు మెడపై నకిలీ కత్తి

► గతేడాది జిల్లాలో నకిలీ విత్తనాల జోరు
► మిరప సాగు చేసి నిండా మునిగిన అన్నదాతలు
► జిల్లాలో 12 మంది మిర్చి రైతుల ఆత్మహత్యలు
► అక్రమార్కులకు ప్రభుత్వం అండదండలు
► ఈ ఏడాదైనా నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్‌


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో నకిలీ విత్తనాల జోరు పెరిగింది. అప్పనంగా ఆర్జించేందుకు వ్యాపారులు నకిలీ విత్తనాలు తెచ్చి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తనాలు వేసి పంట దిగుబడులు రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కోలుకోలేని పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది జిల్లాలో మిర్చి పంట దెబ్బతినటంతో ఇప్పటి వరకు 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారుల కొమ్ముకాస్తోంది. వారిపై ఎటువంటి చర్యలు లేవు.

జిల్లావ్యాప్తంగా అద్దంకి, దర్శి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో వేలాది హెక్టార్లలో రైతులు మిరప సాగు చేస్తారు. గతేడాది 58 వేల హెక్టార్లలో మిరపను సాగు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాల్లో విత్తనాలు తెచ్చి నర్సరీల్లో నారు పెంచి వ్యాపారులు రైతులకు అమ్మారు. కొందరు రైతులు స్వయంగా విత్తనాలను కొని తెచ్చుకొని నర్సరీల్లో నార్లు పోయించుకున్నారు.

గతేడాది మిరపకు అధికంగా ధరలు ఉండటంతో ఈ ఏడాది ఆశతో రైతులు అధికంగా మిరప సాగు వైపు మొగ్గు చూపారు. ముందస్తుగా గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో రైతులు మిరప సాగు చేశారు. ఆది నుండే మిరపకు తెగుళ్లు సోకాయి. జెమిని వైరస్‌తో పాటు పలు రకాల చీడపీడలు చుట్టుముట్టాయి. అధికంగా పెట్టుబడి పెట్టిన రైతులు పురుగుమందులను సైతం అంతేస్థాయిలో పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఎకరానికి రూ.50 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నకిలీల జోరు:
తక్కువ ధరలకు గుంటూరు, విజయవాడ, నంద్యాల తదితర ప్రాంతాల్లో విత్తనాలు కొని అవే నాణ్యమైన విత్తనాలు అంటూ జిల్లాలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అత్యధిక ధరలకు విత్తనాలు కొని వేసినా మొలక సక్రమంగా రావడం లేదు. ఒక వేళ మొలక వచ్చినా పూత దశ నాటికే పనికి రాకుండాపోతున్నాయి. కాపు కాసే పరిస్థితి లేదు. ఇక నర్సరీల్లో ఉత్పత్తి చేసిన మిరప నారు కొని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది.

జిల్లాలో విత్తన వ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. నర్సరీలు సైతం వేలాదిగా వెలిశాయి. నిబంధనల మేరకు నర్సరీలు కొనే విత్తనాలు లాట్‌ నంబర్లతో సహా నమోదు చేయాలి. రైతులకు నారు ఇచ్చే సమయంలో ఏ విత్తనాలకు సంబంధించిన నారు ఏయే రైతుకు అమ్ముతున్నారన్న విషయాలు కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. కానీ వారు ఎటువంటి రికార్డులు నిర్వహించడం లేదు. కొందరు నర్సరీ యజమానులు  నాణ్యమైన విత్తనాలు కాకుండా తక్కువ ధరలకు నకిలీ విత్తనాలు తెచ్చి నార్లు పోసి మరీ రైతులకు అంటగడుతున్నారు.

దీంతో దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, అద్దంకి, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 వేల ఎకరాలకుపైగా పంట పనికి రాకుండాపోయింది. అయినా ప్రభుత్వం విత్తన వ్యాపారులపై మొక్కుబడిగా మాత్రమే చర్యలు తీసుకొని వదిలేసింది. యర్రగొండపాలెం ప్రాంతంలో ఒకరిద్దరు వ్యాపారులపై నామమాత్రంగానే కేసులు నమోదు చేశారు తప్ప... కఠిన చర్యల్లేవు... రైతులు తీవ్రంగా నష్టపోయినా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాదైనా ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌కు నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు