బోగస్‌ బృందాలకు అధికారం అండ!

13 Feb, 2019 04:56 IST|Sakshi

ఒక్కో నియోజకవర్గంలో 15,000 చొప్పున విపక్షం ఓట్ల తొలగింపే లక్ష్యం

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల వివరాలను సేకరించి డేటాబేస్‌ రూపొందిస్తున్న నకిలీ సర్వే టీమ్‌లు

వారిని జాబితా నుంచి ఏరివేయాలంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు  

పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో స్కెచ్‌ అమలు

ఇంటెలిజెన్స్, శాంతి భద్రతల విభాగం అధికారులతోపాటు ఓ రిటైర్డ్‌ ఉన్నతాధికారి పర్యవేక్షణ

టీడీపీ టీమ్‌లకు సహకరించాలని డీఎస్పీలు, రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు 

నకిలీ బృందాలను స్థానికులు పట్టుకున్నా కేసులు నమోదు చేయవద్దని ఆదేశాలు

అడ్డుకునేవారిపై తిరిగి ఎదురు కేసులు బనాయించాలని సూచన

సాక్షి, అమరావతి బ్యూరో: విపక్షం ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు నియోజకవర్గాల వారీగా టీడీపీ సర్వే బృందాలను మోహరించిన ప్రభుత్వ పెద్దలు తమ కనుసన్నల్లో మెలిగే పోలీస్‌ ఉన్నతాధికారుల అండదండలతో ఆగమేఘాలపై పని చక్కబెట్టే కుతంత్రంలో నిమగ్నమయ్యారు! ఎన్నికల ముందు ‘ముఖ్య’నేత వ్యూహ రచన చేసిన ఈ ఓట్ల తొలగింపు ఆపరేషన్‌ను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఇంటెలిజెన్స్‌ విభాగం క్షేత్రస్థాయిలో పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఒక్కో నియోజక వర్గానికి 15,000 చొప్పున వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా చాపకింద నీరులా రాష్ట్రమంతటా సాగిస్తున్న ఈ అక్రమాల తీరు ఇదిగో..!

విపక్షం ఓట్ల తొలగింపే లక్ష్యంగా ముగ్గురు అధికారులు.. 
తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ సర్కారు ఎన్నికల అక్రమాలకు బరి తెగిస్తోంది. భారీగా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే పన్నాగానికి తెర తీసిన ముఖ్యనేత ఈ కుట్ర అమలు బాధ్యతను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించారు. వారిలో ఒకరు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలో కీలక ఉన్నతాధికారి. ఆయన 2014 నుంచి టీడీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారనే గుర్తింపు పొందారు. 23 మంది  వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను అధికార టీడీపీ కొనుగోలు చేయడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. ఇక మరో ఉన్నతాధికారి రాష్ట్ర శాంతి భద్రతల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అక్రమాల కోసమే శాంతి భద్రతల విభాగంలో ప్రత్యేకంగా ఓ పోస్టును సృష్టించి మరీ ఆయన్ను నియమించారు. ఇందులో పాలు పంచుకుంటున్న మరొకరు రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఇంటెలిజెన్స్‌ విభాగంలో ‘ప్రత్యేక కారణాల’తో ఓ పోస్టును సృష్టించి మరీ కొనసాగిస్తుండటం గమనార్హం. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇలా ఈ ముగ్గురు అధికారులు రంగంలోకి దిగారు.

నకిలీ సర్వే బృందాల కోసం రూ.150 కోట్లు..
ముగ్గురు పోలీస్‌ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో టీడీపీ నకిలీ సర్వే బృందాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచరిస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 15 మందితో ప్రత్యేక బృందాలను నియమించి ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చారు. బృందంలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ.50 వేలు జీతంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం రూ.150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతుండటం గమనార్హం. విపక్షం ఓట్ల తొలగింపు కుట్ర అమలులో భాగంగా సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి ఓటర్లు, కుటుంబాల సమాచారాన్ని టీడీపీ బృందాలకు చేరవేశారు. ఈ బృందాలకు క్షేత్రస్థాయిలో పూర్తిగా సహకరించేందుకు జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. 

అడ్డుకుంటే రంగంలోకి దిగుతున్న నిఘా అధికారి
వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నకిలీ బృందాలు పర్యటిస్తూ సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా, వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా మాట్లాడే ఓటర్ల వివరాలతో డేటాబేస్‌ తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 వేల మంది వైఎస్సార్‌ సీపీ అభిమానులు, సానుభూతిపరుల జాబితాతో డేటా బేస్‌ తయారు చేయాలని వారికి లక్ష్యంగా నిర్దేశించారు. వీరంతా ఈ జాబితాను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తారు. అనంతరం ఆ అధికారులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సర్వే చేస్తున్న సమయంలో ఈ బృందాలను ఎవరైనా అడ్డుకున్నా, అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినా వెంటనే జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్‌ అధికారి రంగంలోకి దిగుతున్నారు. టీడీపీ టీమ్‌లకు సహకరించాలని, సర్వే బృందాలను ‘బాస్‌’లే పంపించారంటూ స్థానిక పోలీసులకు చెప్పి వారిని విడిపిస్తున్నారు. వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయడం లేదు. అంతేకాదు.. సర్వేలు చేయడం తప్పేమీ కాదంటూ జిల్లా ఎస్పీలతో ముందుగానే ప్రకటనలు కూడా ఇప్పించారు. మరోవైపు టీడీపీ సర్వే బృందాలను అడ్డుకున్నవారిపై తిరిగి ‘రింగ్‌ఫుల్‌ రిస్ట్రెయింట్‌’ కేసులు నమోదు చేయాలంటూ జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారి స్థానిక పోలీసులను ఒత్తిడి చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మీద అదేవిధంగా అక్రమ కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. 

నకిలీ బృందాలపై కేసులు లేవు..
రాష్ట్రమంతటా జోరుగా తిరుగుతున్న నకిలీ సర్వే బృందాలు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ బృందాలు సర్వేల పేరుతో విపక్షం ఓట్లను తొలగిస్తున్న విషయం బహిర్గతమైంది. అయితే ఇంతవరకు ఎవరిపైనా సరైన కేసు పెట్టకపోవడం గమనార్హం. ఎన్నికల అక్రమాల కోసం టీడీపీ ప్రభుత్వం బరితెగించడం, అందుకు ముగ్గురు  పోలీసు ఉన్నతాధికారులతోపాటు అధికార యంత్రాంగం సహకరిస్తుండటం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వచ్చిన  కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌ సునీల్‌ ఆరోరాను కలసిన వైఎస్సార్‌ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న తీరును ఆయన దృష్టికి కూడా తెచ్చారు. ఈసీ వెంటనే స్పందించి ఈ నకిలీ సర్వేలు, ఎన్నికల అక్రమాలకు తెరదించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

అడ్డుకున్న విపక్ష నేతలపై అక్రమ కేసులు..
విపక్షం ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్‌ సంస్థల ముసుగులో అధికార పార్టీ చేస్తున్న కుట్రలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ట్యాబ్‌లతో తిరుగుతూ ఓటర్ల జాబితాలతో సర్వే చేస్తున్న బృందాన్ని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో గత నెల 24న అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిని పట్టుకున్నందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే అక్రమంగా కేసులు బనాయించడం గమనార్హం. జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును అరెస్టు చేయడంతోపాటు మరో 14 మందిని పోలీస్‌స్టేషన్లకు తరలించినప్పుడు కూడా నకిలీ సర్వే బృందాలు ప్రజల వద్దకు వెళ్లగలిగాయంటే వారికి ప్రభుత్వం, పోలీసుల అండ ఉందని స్పష్టమవుతోంది.

ఓట్ల దొంగలొచ్చారు జాగ్రత్త!
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్‌ పురంలో నెల రోజుల క్రితం సర్వే పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న కొందరు యువకులు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు క్రాంతినగర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల వివరాలను నమోదు చేస్తున్న తెనాలికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పట్టుకుని టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 25 ఇళ్లలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించినందుకు రూ.800 చొప్పున తమకు చెల్లిస్తున్నట్టు సర్వేలో పాల్గొంటున్న వారు వెల్లడిస్తున్నారు.

ఫారం 7 లేకుండానే ఓట్ల తొలగింపు
ఏదైనా ఓటు తొలగించాలంటే ఫారం 7ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఓటరు నుంచి వివరణ తీసుకున్న తర్వాతే తొలగింపు ప్రక్రియ చేపట్టాలి. ఇవేమీ లేకుండా జాబితా నుంచి ఓటర్ల వివరాలు మాయం కావడంపై నిలదీస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలను అధికారం అండతో ప్రభుత్వం అరెస్టు చేయిస్తోంది. పోలీసుల అండతోనే నకిలీ సర్వే బృందాలు గ్రామాల్లో ధైర్యంగా తిరుగుతున్నాయి. 

అభిప్రాయం కోసం ఓటరుకార్డుతో ఏం పని?
- అనంతపురం జిల్లా గుంతకల్లులో గత డిసెంబర్‌ 18వతేదీన ఓటర్ల వద్దకు వెళ్లి రహస్యంగా సర్వే నిర్వహిస్తూ పేర్లు, అభిప్రాయాలు అడిగి ట్యాబ్‌లో వేలిముద్ర వేయాలని సూచిస్తున్న 40 మంది సభ్యులను వైఎస్సార్‌ సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారి వివరాలు, ఓటరు కార్డు నంబర్‌తో ఏం పని? అని నిలదీయటంతో బోగస్‌ సర్వే బృందాల గుట్టు బయట పడింది. గతంలో కూడా జిల్లాలో పలు చోట్ల రకరకాల పేర్లతో నకిలీ బృందాలు తిరుగుతుండగా స్థానికులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
గతేడాది నవంబర్‌ 1వ తేదీన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడమనూరులో ఎన్డీటీవీ తరపున వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతూ వ్యక్తిగత వివరాలను ఆరా తీస్తూ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు నమోదు చేసుకుంటున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సూచనల మేరకు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. 

మరిన్ని వార్తలు