గోల్‌మాల్‌ రవాణా

18 Oct, 2017 09:09 IST|Sakshi

రవాణా శాఖలో రిజిస్ట్రేషన్లలో మాయ    

యజమాని లేకుండా వాహన రిజిస్ట్రేషన్‌

ఫైనాన్స్‌ కంపెనీలతో సిబ్బంది కుమ్మక్కు

కీలకంగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు

తిరుపతి మంగళం: రవాణా శాఖలో ఏదైనా వాహనాన్ని విక్రయించాలంటే యజమాని వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఇక్కడ ఏజెంట్లు లైన్‌లో నిలబడి మొదట్లో వాహన రిజిస్ట్రేషన్‌ కోసం అసలు యజమాని ఇచ్చిన ఆధార్‌ను తీసుకుని వాహన యజమానిగా అవతారమెత్తుతున్నారు. వచ్చిన వ్యక్తి వాహన యజమాని కాదని రవాణాశాఖ సిబ్బందికి కూడా తెలుసు. అయినప్పటికీ ఏజెంట్లతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా పని కానిచ్చేస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లోని రవాణాశాఖ కార్యాలయాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ ఫైనాన్స్‌ కంపెనీలతో ముందుగానే అటు ఏజెంట్లు, ఇటు రవాణాశాఖ సిబ్బంది చేతులు కలిపి వ్యవహారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు లాగుతున్నారు.

ఏజెంట్ల మాయాజాలం
నకిలీ రిజిస్ట్రేషన్లను రవాణా శాఖలో ఏజెంట్లు దగ్గరుం డి నడిపిస్తున్నారు. వాహనదారుడు ఫైనాన్స్‌లో బైక్‌ను కొనుగోలు చేసి  రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా ఆరునెలలు, ఏడాది పాటు వాడుకుని ఫైనాన్స్‌ సంస్థకు డబ్బులు చెల్లించని వాహనాన్ని సంస్థ నిర్వాహకులు సీజ్‌ చేస్తారు. అలాంటి వాహనాలకు వారు తిరిగి వేలం నిర్వహిస్తుంటారు. వీటికి రిజిస్ట్రేషన్‌ చేయాలంటే పాత యజమాని రాడు. దీంతో రోడ్డు పక్కన వాహనాలను విక్రయించే వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయంలోని సిబ్బంది, ఏజెంట్లతో కుమ్మక్కై ఎవరో ఒకరి వేలిముద్రలతో రిజిస్ట్రేషన్‌ చేయించేసి వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. అందుకు నజరానాగా అటు ఫైనాన్స్‌ సంస్థల నుంచి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. వాహనాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు.

పాత తేదీలతో వ్యవహారం
ప్రస్తుతం రవాణా శాఖలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌  విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో నేరుగా డీలర్ల వద్దనే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. 24గంటల్లో శాశ్వత నెంబర్‌ వాహన యజమానికి అందుతోంది. అయితే నూతన విధానం  కొన్ని వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది.  గతంలో కొన్ని వాహనాలను మాత్రం పాత విధానాన్ని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో  ఫైనాన్స్‌ సంస్థలు సీజ్‌ చేసిన  వాహనాలన్నీ పాతవి కావడంతో వీరి పని సులువుగా మారుతోంది.

వాహనాన్ని ఇతరులకు అమ్మి.. అతని పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే కచ్చితంగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అప్పుడే వాహనాన్ని ఇతరులకు బదలాయిస్తారు. అయితే జిల్లాలో మాత్రం వాహన యజమాని లేకుండానే నకిలీ యజమాని వేలిముద్రలతో ఇతరుల పేరిట పని కానిచ్చేస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్స్‌ తీసుకుని సకాలంలో కంతులు చెల్లించకుండా సీజ్‌ చేసిన వాహనాలను ఇతరులకు విక్రయించేస్తున్నారు. అది కూడా మొదట ఫైనాన్స్‌ తీసుకున్న యజమాని లేకుండానే. ఏజెంట్ల మాయాజాలంతో ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఫిర్యాదులొస్తే చర్యలు
యజమాని లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయడం చట్టవిరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. ముందుగా వాహన దారుడి ఆధార్‌ను కంప్యూటర్‌లో నమోదు చేస్తాం. అలా చేసుకోకుంటే వాహనాన్ని కొనుగోలు చేసినవారు నేరుగా మా వద్దకు రావాలి. అప్పుడు ఆ వాహన రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలో సూచిస్తాం. అలా కాకుండా ఏజెంట్లతో కుమ్మౖక నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని, మోసపోవద్దు. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం.
– వివేకానందరెడ్డి, తిరుపతి ఆర్టీఓ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా