ఓటు.. డూప్లికేటు!

16 Nov, 2018 12:51 IST|Sakshi

జిల్లాలో భారీగా డబుల్‌ ఓట్లు

ఒకే ఐడీపై పలువురికి రెండేసి చోట్ల కార్డులు

మార్పులకు అవకాశమివ్వని అధికార పార్టీ

విపక్షాల మద్దతుదారుల పేర్లు మాత్రం  జాబితాలో గల్లంతు

ఓటు నమోదు.. సవరణ.. తొలగింపుల ప్రక్రియ పకడ్బందీగా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలో రెండేసి, మూడేసి ఓట్లు ఉన్న వారు భారీ సంఖ్యలో ఉన్నారు. బోగస్‌ ఓట్లకు లెక్కేలేదు. వీటిలో కొన్నింటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రయత్నించినా.. అధికార పార్టీ అడ్డుపడుతోంది. తమ అధికారం చూపించి విపక్ష పార్టీలకు మద్దతు దారులుగా ఉన్న వారి పేర్లను మాత్రమే జాబితా నుంచి గల్లంతు చేస్తోంది. అందుకే ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండగా.. కొందరికి ఓటే లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

అనంతపురం అర్బన్‌: ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపు ప్రక్రియ అపహాస్యమవుతోంది. ఒక రకంగా ఓటు.. డూప్లికేటు చందంగా మారింది. జిల్లాలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తికి అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలోనూ రాప్తాడు నియోజకవర్గంలో రెండేసి ఓట్లు ఉండడం గమనార్హం. ఇలా రెండు చోట్ల ఓటు కలిగి ఉండకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతున్నా.. ఆచరణలో అమలు కావడం లేదు. ఇక అధికారపార్టీకి చెందిన నాయకులు అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకుని ఓట్ల సవరణ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీవైఎస్సార్‌సీపీ ఓటర్లు లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగించేలా చేస్తున్నారు. ఇక తమ మద్దతుదారులకు మాత్రం రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేయిస్తున్నారు. అందుకే అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలోనే దాదాపుగా 64 వేల ఓట్లు గల్లంతయ్యాయి. 

అర్బన్‌ నియోజకవర్గంలోనే ఎక్కువ
అనంతపురం అర్బన్‌ పరిధిలో 2014 ఎన్నికల సమయంలో 2,54,236 ఓట్లు ఉంటే 64,592 ఓట్లు తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 1,89,644కు చేరింది. ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన వారివే ఉన్నాయని సమాచారం. అదే తరహాలో తాడిపత్రిలోనూ 14,322 ఓట్లు, ధర్మవరంలో 10,475 ఓట్లు, కదిరిలో 7,757 ఓట్లు, హిందూపురంలో 3,426 ఓట్లు, పుట్టపర్తిలో 875 ఓట్లు, గుంతకల్లు నియోజకవర్గంలో 325 ఓట్లు తొలగించారు.

నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓటు  
వాస్తవంగా ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే నియోజవకర్గం పరిధిలో మాత్రమే ఓటు బదిలీకి అవకాశం ఉంటుంది. సదరు వ్యక్తి వేరొక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే... ముందుగా ప్రస్తుతమున్న ఓటును రద్దు చేయించుకుని, ఎక్కడైతే నివాసముంటున్నారో ఆ నియోజకవర్గంలో ఫారం–6 ద్వారా కొత్తగా ఓటరు నమోదుకు క్లయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని కొందరికి ఒకే ఐడీ నంబరుతో రెండు జిల్లాల్లో ఓటు కార్డులున్నాయి. ఇలాగే జిల్లాలో పలువురికి రెండేసి నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. అనంతపురం అర్బన్‌లోనూ, ఇతర జిల్లాలోనూ, ఇతర నియోజకవర్గాల్లోనూ ఒకరికి ఒకే ఐడీ మీద రెండు ఓట్లు ఉన్నాయి. అనంతపురం అర్బన్‌లో ఓటు ఉన్నవారికి... అదే ఐడీపైన రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఓటు ఉంది. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. జిల్లాలో ఎక్కువగా పక్కపక్కన  ఉన్న నియోజకవర్గాల్లో ఇలాంటి డబుల్‌ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఓటరు సవరణ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.  

యాడికి మండలం రాయలచెరువు గ్రామంలోని డోర్‌ నంబర్‌ 2–33ఏ బూత్‌ నంబర్‌ 56లో ఉన్న తెల్లాకుల శేఖర్‌ కుమార్తె అనూషకు తాడిపత్రి నియోజకవర్గంలో ఐడీ నంబరు ఐఎఫ్‌హెచ్‌ 1105122పై ఓటు కార్డు ఉంది. ఈమెను గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం గుత్తి ఆర్‌ఎస్‌ గ్రామానికి ఇచ్చి వివాహం జరిపించటంతో అక్కడ కూడా ఇంటి నంబర్‌ 19–1020లో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 217లో ఐఎఫ్‌హెచ్‌ 1105122 ఐడీపై ఓటు ఉంది. ఇలాంటి వారు ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా మంది∙ఉన్నారు.

మరిన్ని వార్తలు