విరిగిపడిన కొండ చరియలు

20 Jun, 2015 02:15 IST|Sakshi
విరిగిపడిన కొండ చరియలు

- కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం
- విశాఖ-కిరండూల్ పాసింజర్ రద్దు
అరకులోయ/అనంతగిరి:
కొత్తవలస-కిరండూల్ రైలు మార్గంలో పట్టాలపై గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. అనంతగిరి మండలం శిమిలిగుడ స్టేషన్ సమీపంలోని 82/15 నుంచి 82/17 మైలు రాయి మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టాలపై రాళ్లు, మట్టిపేరుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో ఉన్న తిరుపతి అనే ఉద్యోగి దీనిని గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

ప్రత్యేక రైలులో సంఘటన స్థలానికి అధికారులు ఎకాయెకిన చేరుకున్నారు. రెండు పొక్లెయినర్‌లను రప్పించి పట్టాలపై పేరుకుపోయిన రాళ్లు, మట్టి తొలిగించారు. విశాఖ నుంచి కిరండూల్ వెళ్తున్న గూడ్స్ రైలును వెనక్కి మళ్లించారు. కిరండూల్ నుంచి శిమిలిగుడ వరకు పలు గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలును శుక్రవారం రద్దు చేశారు. సాయంత్రానికి కొండచరియలను తొలిగించి రైళ్ల  రాకపోకలను పునరుద్ధరించారు.
 
ఏటా ఇదే సమస్య:  వర్షాలప్పుడు కేకేలైన్‌లో ఏటా ఇదే పరిస్థితి చోటుచేసుకుంటోంది. రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వర్షాకాలం వచ్చిందంటే కరకవలస నుంచి బొడ్డవర రైల్వే స్టేషన్ వరకు ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి కిరండూల్ పాసింజర్ రైలు ప్రయాణికులు నరకయాతనకు గురయ్యారు. ఈనెల 17వ తేదీ బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి విశాఖ నుంచి దమన్‌జోడి వెళుతున్న గూడ్స్ రైలు బోగి   పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.  
 
కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి గతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అటువంటి ముందస్తు చర్యలు చేపట్టినట్టు లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అటువంటి ప్రాంతాలను గుర్తించి వర్షాకాలానికి ముందుగానే   చర్యలు చేపడితే బాగుంటుందన్న వాదన ఉంది.

>
మరిన్ని వార్తలు